పూల ధరలు పైపైకి..

Flower Price Increase In Bathukamma Season In Sangareddy - Sakshi

సాధారణంగా ఇంట్లో పూజలు, వివాహ శుభకార్యాలకు ఎక్కువగా పూలకు ప్రాధాన్యత ఇస్తారు. పూలను పూజిస్తూ దేవుళ్లుగా భావించే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది బతుకమ్మ పండుగ. పూల పండుగ అంటే ఊరూ వాడ బతుకమ్మ సందడి. వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలైన పూల జాతర సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. వివిధ రకాల పువ్వుల్లో ఔషధ గుణాలుంటాయని, బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేస్తే చెరువు నీటిలో ఉండే క్రిములు చనిపోయి నీరు శుభ్రమవుతుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న బతుకమ్మ పండుగ పూలు సాగు చేసే రైతులను నిరాశకు గురి చేసింది.

సాక్షి, సంగారెడ్డి:  ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్న దిగుబడి రాకపోవడంతో పండుగ సందర్భంగా బతుకమ్మ బంతి పైపైకి లేస్తోంది. పూల పండుగైన బతుకమ్మ పండుగ సందర్భంగా వివిధ రకాల పువ్వులకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా సద్దుల బతుకమ్మకు బంతి, ముద్ద బంతి, తంగెడు, చామంతి, పట్టుకుచ్చుల పువ్వులకు భలే గిరాకీ పెరిగింది. హుస్నాబాద్‌ పట్టణంలోని పందిల్లకు చెందిన గూళ్ల రవి తనకున్న భూమిలో బంతి, చామంతి, మల్లె, కనకంబురాల, పట్టుకుచ్చుల సాగు చేశాడు. సాగు చేసిన తోటలు కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ సందర్భంగా రవి ఎకరం కనకంబురాలు, 10 గుంటలు పట్టుకుచ్చులు, 10 గుంటలు బంతి, 10 గుంటలు మల్లె పూలు సాగు చేశాడు. ముసురు వర్షాలతో పూల సాగు అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. కొద్దోగొప్పో పూలు పూసిన   బంతి పూలు గుత్తులతో నిగనిగలాడుతోంది.

కిలోకి రూ.50కి పైనే..
సాధారణ రోజుల్లో ఒక కిలోకు రూ.30 ధర పలుకుతుందని, పండగ వేళల్లో మార్కెట్‌లో కిలో బంతికి రూ.50 పలుకుతుందని రైతు తెలిపారు. పూల సాగు లాభదాయకమని నమ్మిన రైతు రకరకాల పువ్వుల సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ బంతి పూల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఏ పల్లె, ఏ ఊరు, ఏ వాడలో చూసిన బతుకమ్మ ఆటలతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పూల ధరలకు రెక్కలచ్చాయి. తుంపురు వర్షాలతో, ఉన్న నీటితో వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు పూల తోటలపై ఎక్కువ దృష్టి సారించకపోవడంతో బతుకమ్మ పండుగకు అవసరమయ్యే పూల ధరలు కొండనెక్కి కూర్చున్నాయి. మరో మూడు రోజుల్లో పూల జాతర రానుండటంతో బంతి పూల ధరలు జనానికి చుక్కలు చూపెట్టనున్నాయి.

మండుతున్న ధరలు 
ఓ వైపు బతుకమ్మ సంబరాలు, మరో వైపు వర్షాలు లేక పూల తోటల సాగు తగ్గిపోవడంతో పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్‌ మార్కెట్‌లో పూల ధరలు మండుతున్నాయి. బంతి కిలోకు రూ.100, చామంతి కిలోకు రూ.400, కాగడ మల్లెపువ్వులు రూ.700, గులాభి రూ.400 ధరలు పలుకుతుండటంతో జనాలు బెంబలెత్తిపోతున్నారు. దీంతో పాటుగా పట్టుకుచ్చుల పువ్వులు ఒక్క కట్టకు రూ.20 పలుకుతుంది. ఇది కూడ నేరుగా  రైతులు అమ్మితేనే ఈ ధర పలుకుతుంది. బతుకమ్మ పండుగ సందర్బంగా గునుగు. తంగేడు, పట్టు కుచ్చులు, చామంతి, బంతి పువ్వులను అధికంగా వాడుతారు. ప్రస్తుతం ఉన్న ఈ పూల ధరలు బతుకమ్మ పండుగ వరకు ఇంకా పెరగవచ్చని పూల వ్యాపారులు చెబుతున్నారు.

పూల ధరలు పెరిగినయ్‌ 
బతుకమ్మ సందర్భంగా పూల ధరలు పెరిగినయ్‌. గతం కంటే ఈ ఏడాది పూల దిగుబడి తగ్గడంతో ధరలు అంతకంతకు పెరిగాయి. హోల్‌సెల్‌ ధరలు సైతం ఎక్కువ పెంచారు. బంతిపూలు కిలోకు రూ.100కు పైగా అమ్ముతున్నాం. పూల డిమాండ్‌ను బట్టి పండుగ రోజున బంతి పూల ధర రూ.200 వరకు పెరిగే అవకాశాలున్నాయి. 
– షబ్బీర్, పూల వ్యాపారి, హుస్నాబాద్‌

దిగుబడి తగ్గింది  
పండుగను బట్టి పూల సాగు చేపడుతాను. బతుకమ్మ పండుగ సందర్భంగా 10 గుంటల్లో బంతి పూల విత్తనాలు చల్లితే, సగం నష్టం వచ్చింది. ముసురు వర్షాలతో పూలు మురిగిపోయి అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ పువ్వులను సిద్దిపేట, హుస్నాబాద్‌ మార్కెట్‌కు తరలించి అమ్ముతున్నాను. కిలోకి రూ.50 ధర పలుకుతోంది. 
– గూళ్ల రవి, రైతు, పందిల్ల  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top