అమ్మ ఆది గురువు | first teacher is mother | Sakshi
Sakshi News home page

అమ్మ ఆది గురువు

Published Sat, Jun 28 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

అమ్మ  ఆది గురువు

- పిల్లల విద్యాభ్యాసంలో కీలక పాత్ర  
- స్కూల్‌కు తీసుకెళ్లడం.. తీసుకురావడం..  
- తల్లులకు రోజంతా హోం‘వర్క్’

మంచిర్యాల అర్బన్ : పిల్లల మొదటి బడి అమ్మ ఒడే. చిన్నారులను పాఠశాలల్లో చేర్చే వరకూ అమ్మనే గురువు. అందుకే ఆది గురువు తల్లి అంటారు పెద్దలు. పిల్లల ఉజ్వల భవిష్యత్ బంగారు బాట వేయడంలో మాతృమూర్తిదే కీలక పాత్ర. అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఉన్నత విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అమ్మ పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకూ ఇంటి పని.. వంట పని.. స్కూల్ పనులతో బిజీ బిజీ. పిల్లలను ఉదయం ఏడున్నరకు నిద్ర లేపడం, స్నానం చేయించి చక్కగా తయారు చేయడం, టిఫిన్ తినిపించడం దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ సర్దడం వరకు అన్నీ చక్కబెడుతుంది.

బ్యాగులో పుస్తకాలు, పెన్ను, పెన్సిల్ ఇలా సరి చూస్తుంది. స్కూల్‌కు తీసుకెళ్లడం, చిన్నపిల్లలైతే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్లి తినిపించడం, సాయంత్రం స్కూల్ నుంచి తీసుకు రావడం దినచర్యగా మారింది. కొందరు పిల్లలు ఆటోలో, స్కూల్ బస్సులో వెళ్తుండగా.. మరికొందరు తండ్రులు పాఠశాలల్లో మోటార్‌సైకిల్‌పై దింపేస్తున్నారు. స్కూల్‌లో జరిగిన విషయాలను పిల్లలు చెబుతుంటే చిన్ని చిన్ని మాటలను విని సంబరపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే తల్లి, భార్య పాత్రలో పోషిస్తూ యంత్రంలా పని చేస్తున్నారు. సెలవు రోజుల్లో కొంత ఉపశమనం కలుగుతోంది. మిగితా రోజుల్లో ఎంత కష్టమైన పనైనా సరే ఇష్టంగా చేస్తారు.  
 
పట్టణాలకు వలస బాట

పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతటి త్యాగాలకైనా వెనుకంజ వేయడం లేదు. చదువు విలువ తెలిసిన వారు పిల్లల ఉత్తమ భవిష్యత్ కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటుఆన్నరు. ఒకప్పుడు పొట్ట కూటి కోసం వలస వెళ్లిన గ్రామీణులు.. ప్రస్తుతం పిల్లల చదువు కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. ఉన్నత విద్యకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేలా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వారైతే మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవల గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ చదువుపై అవగాహన పెరిగింది. కార్పొరేట్ చదువులూ విస్తరించాయి. హైస్కూల్ చదువు స్థానికంగానే పూర్తి కాగానే కళాశాల చదువు కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల వంటి పట్టణాలకు వెళ్తున్నారు. ఉద్యోగులూ పిల్లల చదువు కోసం ఆయా నగరాలు, పట్టణాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసి ఎంత ఫీజైనా చెల్లించడానికి వెనుకంజ వేయడం లేదు. చదువులో పిల్లల్లో అంతగా పురోగతి లేకపోవడంతో కుటుంబాన్ని హైదరాబాద్, వరంగల్ నగరాలకు మారుస్తున్నారు.

మంచిర్యాల చట్టుపక్కల గ్రామీణులు కళాశాల చదువు కోసం మంచిర్యాలకు వస్తున్నారు. మంచిర్యాలకు చెందిన అనేక మంది పిల్లల చదువు కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. వ్యాపారులు, ఉద్యోగుల పిల్లల్లో కొందరు హాస్టల్ చదువుకు ససేమిరా అంటే.. వారి కోసం తల్లులు హైదరాబాద్‌లో గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ విధానం ద్వారా ఖర్చు తగ్గడంతోపాటు పిల్లల చదువు తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశముంది. పిల్లలు క్రమ శిక్షణతో ఉంటారు.
 
హోంవర్క్

బండెడు బరువు ఉన్న పుస్తకాలను మోసి పాఠశాలకు వెళ్లి వచ్చిన పిల్లలు అలసిపోయి పడుకుంటారు. కొద్ది సేపటి తర్వాత ఆటలాడేందుకు క్రీడా మైదానం వైపు పరుగులు తీస్తారు. మళ్లీ అలసిపోయి ఇంటికి వస్తారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఇచ్చిన హోంవర్క్‌ను మరిచిపోతారు. తల్లి హోంవర్క్ విషయమై గుర్తు చేస్తే చేయనంటూ మారాం చేస్తారు.

పిల్లలను దగ్గరకు తీసుకుని హోం వర్క్ చేయిస్తుంది. అక్షరాలు దిద్దిస్తుంది. గురువు స్థానంలో నిలుస్తుంది. హోం వర్క్ చేయనని మారాం చేసినా బుజ్జగించి చేయిస్తుంది. చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా...అంటూ చదువుపై శ్రద్ధ పెరిగేలా చిట్టి కథలు చెబుతుంది. పిల్లలకు సంతుష్టి నిద్ర అవసరం కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయేలా లాలిపాట పాడుతుంది.
 
 పాఠశాలకు తల్లులు..

ఇదేంటి అమ్మలు పాఠశాలకు వెళ్లడం ఏమిటీ అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు పిల్లలతోపాటు తల్లులూ బడి బాట పడుతున్నారు. పిల్లలకు మధ్యాహ్నాం వేళ భోజనం తీసుకు వెళ్లడం దిన చర్యగా మారింది. స్కూల్ వెళ్లనని మారాం చేసే పిల్లలను బుజ్జగించి పంపించడం, వారికి ఇష్టమైన కూరలు, టిఫిన్‌లు తెస్తానని భరోసా ఇస్తేనే స్కూల్‌కు వెళ్తున్నారు. పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకెళ్లి మధ్యాహ్నా భోజన విరామ సమయంలో తల్లులే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తున్నారు.

దగ్గరుండి భోజనం పెట్టడం, నీళ్లు తాగించడం చేసిన తర్వాత పిల్లలను తరగతి గదిలో విడిచి ఇంటి బాట పడుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లడం వల్ల పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకునే వీలు కలుగుతుంది. ఎప్పుడు ఇంట్లో ఉండే తల్లులకు ఇతర పిల్లల తల్లులతో పరిచయాలు ఏర్పడుతాయి. కొన్ని పాఠశాలల్లో తల్లులు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన తల్లులు స్పోకెన్ ఇంగ్లిషు నేర్చుకుంటున్నారు. ఇంగ్లిషుపై పరిజ్ఞానం పెంచకుంటే పిల్లలతో చక్కగా హోంవర్క్ చేయించడంతోపాటు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం ఉంది.
 
ఆహారం

పిల్లల ఆహారం విషయంలో తల్లి ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. రుచికరమైన భోజనం, టిఫిన్లు చేసి పెడుతుంది. ఆరోగ్యానికి అవసరమైన పండ్లు, జ్యూస్ అందిస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, చురుకుగా మెదలాలని తపిస్తుంది. శక్తినిచ్చే పౌడర్లను పాలల్లో వేసి తాగిస్తుంది. పిల్లల చదువు.. వారి ఆరోగ్యంపై తల్లి చూపే శ్రద్ధ మరెవరూ చూపలేరు.
 
తండ్రుల పాత్ర కీలకమే..

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో తండ్రుల పాత్ర కీలకంగా పేర్కొనవచ్చు. పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించడం దగ్గర నుంచి రోజు ద్విచక్రవాహనంపై పాఠశాలకు తీసుకెళ్లడం, తీసుకు రావడం, యూనిఫాం, షూ, సాక్స్‌లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్‌లు, రబ్బరులు కొనుగోలు చేయడం వరకు అన్నీ తండ్రులు దగ్గరుండి చేస్తారు. పాఠశాల స్థాయి కాగానే ఏ కళాశాలలో చేర్పించాలి, ఉన్నత చదువులకు ఏ కోర్సులో చేర్పించాలనే అంశాలను సూచిస్తాడు. ఎక్కడా తమ పిల్లలకు నష్టం జరగకుండా, భవిష్యత్‌కు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement