చిగురిస్తున్న ఆశలు.. | Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న ఆశలు..

Published Mon, Feb 5 2018 7:54 PM

farmers hopes on dubbaka pond - Sakshi

ధర్పల్లి : రామడుగు ప్రాజెక్ట్‌ ఎత్తిపోతల ద్వారా దుబ్బాక గ్రామానికి సాగునీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు నిజామాబాద్‌ ఎంపీ కవిత శనివారం జలసౌధ సమావేశంలో విన్నవించటంతో రైతన్నల ఆశలు చిగురిస్తున్నాయి. దుబ్బాక గ్రామానికి ప్రాజెక్ట్‌ ఎత్తిపోతల ద్వారా రూ.5 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఎత్తిపోతల పనులు పూర్తి అయితే గ్రామంలోని సుమారు 314 ఎకరాలను సాగునీరు అందనుంది. దీంతోపాటు తాగునీటి కష్టాలు తీరే రోజులు రానున్నాయి.  


వైఎస్‌ హయాంలోనే పునాది..


రామడుగు ప్రాజెక్ట్‌ ఆధునీకరణ పనులకు 2006లోనే రూ.20 కోట్లు కేటాయించారు. గతంలోని ప్రాజెక్ట్‌ కింద 11 గ్రామాలకు 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆధునీకరణ పనులతో ప్రాజెక్ట్‌ ఆయకట్టు సామర్థ్యం పెంచుతూ మరో రెండు వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు చేపట్టారు. దీంతో కొత్తగా నాలుగు గ్రామాలను  పూర్తి స్థాయిలో 7 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2006లోని రామడుగు గ్రామానికి వచ్చి ప్రాజెక్ట్‌ ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేశారు. అప్పట్లోనే ప్రాజెక్ట్‌ ద్వారా 7 వేల ఎకరాల సాగునీటి వాటాలోని దుబ్బాక గ్రామానికి సుమారు 314 ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించేలా ఇరిగేషన్‌ శాఖలోని రికార్డులు ఉన్నాయి.


ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామం మాత్రమే ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఉండేది. గ్రామానికి సాగునీటి కష్టాలు తీరేలా గ్రామస్తులంతా కలిసి అప్పటి ఆర్మూర్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను పలుమార్లు కలిసి విన్నవించారు. దుబ్బాక రైతుల నీటి కష్టాలు తీర్చేందుకు 2004లోని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కలిసి సాగునీటి కష్టాలు వివరించారు. వైఎస్‌ దుబ్బాక రైతుల మొరను తీర్చేందుకు రామడుగు ప్రాజెక్ట్‌ ఆధునీరణ పనుల నిధుల్లోనే ఎత్తిపోతలతో సాగునీటిని అందించాలని వాటా కల్పించారు.   


నెరవేరనున్న ఏళ్లనాటి కల..


దుబ్బాక ప్రాంతంలోని భూగర్భ జలాలు అంతంతే మాత్రంగా ఉండేవి. ఏటా గ్రామస్తులు సాగునీరు, తాగునీటి కష్టాలు పడుతూనే వస్తున్నారు. తమకు రామడుగు ప్రాజెక్ట్‌లోని గ్రామానికి సాగునీటి వాటాను దక్కించుకునేందకు గ్రామస్తులంతా ఉద్యమంలా శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల కమిటీని వేశారు. సాగునీటిని దక్కించుకునేందుకు నేతలపై ఒత్తిడిలు తెచ్చారు. 20 ఏళ్ల నుంచి చేపట్టిన సాగునీటి పోరాటానికి మంచి రోజులు రానున్నాయి. ప్రాజెక్ట్‌ జలాల వాటాను దక్కించుకునేలా నిధుల మంజూరుకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సుమనరెడ్డితో పాటు గ్రామ అడ్వికెట్‌ ఆలా మోహన్‌రెడ్డి, పంచాయతీ పాలకవర్గం, గ్రామకమిటీ, ఎత్తిపోతల సాధన కమిటీ ప్రతినిధుల కృషి ఫలితంతోనే మళ్లీ నిధులు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నారు.  


సంతోషంగా ఉంది


దుబ్బాక గ్రామానికి ఎత్తిపోతల ద్వారా సాగునీటి కష్టాలు తీ ర్చేందుకు అడుగులు పడుతుండటంతో చాలా సంతోషంగా ఉంది. ఏళ్ల తరబడి సాగు, తాగునీటికి కష్టాలు పడుతు న్నాం. ఎం పీ కవిత కృషి చేయటం హర్షణీయం.  గోసికొండ నర్సయ్య, గ్రామస్తుడు, దుబ్బాక


కష్టాలు తీరనున్నాయి


దుబ్బాకకు సాగునీరు వచ్చేలా అడుగులు పడుతుండటంతో రైతుల కష్టాలు తీరనున్నాయి. ఎత్తిపోతల పనులు పూర్తయితే రైతులు, ప్రజల కష్టాలు దూరం అవుతాయి. ఎమ్మెల్యే ఎత్తిపోత లకు నిధుల మంజూరుకు ఎంతో కృషి చేశారు. టీచర్‌ నర్సయ్య, ఎంపీటీసీ, దుబ్బాక


గ్రామస్తుల కృషి ఎంతో ఉంది


దుబ్బాకకు సాగునీరు వచ్చేలా గ్రామస్తులంత చేసిన కృషి ఎంతో ఉంది. ప్రాజెక్ట్‌ ద్వారా వాటాను దక్కించుకునేందుకు గ్రామకమిటీ, ఎత్తిపోతల సాగునీటి కమిటీ వేశాం. ఎంపీ కవిత చొరవతో గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయి.   నూకల నర్సయ్య, వార్డు సభ్యుడు, దుబ్బాక
 

Advertisement
Advertisement