రైతు భరోసాకే రాహుల్ యాత్ర | Farmers Ensuring Rahul trip | Sakshi
Sakshi News home page

రైతు భరోసాకే రాహుల్ యాత్ర

May 5 2015 3:42 AM | Updated on Oct 1 2018 2:00 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతలు అప్పుల ఊబిలో...

కొల్చారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు వి.సునీతారెడ్డి అన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈనెల 11న జిల్లాలో ‘రైతు భరోసా పాదయాత్ర’ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం వారు మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే గీతారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ ప్రతినిధి శ్రవణ్‌కుమార్ తదితరులతో కలిసి కొల్చారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్న ఘనపూర్‌లో విలేకరులతో మాట్లాడారు.

పంజాబ్, విదర్భ, బీహార్‌లో రాహుల్ ‘రైతు భరోసా యాత్ర’ నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భరోసా యాత్ర చేపడుతున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల వల్లే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు చెప్పారు.
 
భూసేకరణ ఆర్డినెన్స్ సరికాదు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ రైతులకు ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని కాంగ్రెస్ నేత, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వాలు వ్యవహరించాలని సూచించారు. బడ్జెట్‌లో రూ.23,480 కోట్లు వ్యవసాయం కోసం ప్రకటించినా అందులో ఖర్చుచేసింది స్వల్పమేనన్నారు. ఇందులో యాంత్రీకరణ పరికరాల కోసం జిల్లాకు రూ.100 కోట్లు మంజూరు చేశామని చెబుతున్న ప్రభుత్వం వాటి లెక్కలను చూపడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
20 వేల మంది యువ రైతులతో..
రాహుల్‌గాంధీ రైతు భరోసా యాత్రను కార్యకర్తలు, పార్టీ నాయకులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. పాదయాత్రలో పాల్గొనేందుకు 20 వేల మంది యువ రైతులు తరలివస్తున్నారని చెప్పారు. సమావేశంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్‌రావు, సేవాదళ్ కమిటీ జిల్లా అధ్యక్షులు అమరసేనారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆప్కో డెరైక్టర్ అరిగే రమేశ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మేఘమాల సంతోష్‌కుమార్, మండల పార్టీ నాయకులు నరేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement