
కుటుంబ సభ్యులతోనే సభ నడుపుతారా?
ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతోనే శాసనసభ సమావేశాలను నడుపుతున్నారని టీడీపీ శాసనసభ్యులు ఆరోపించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతోనే శాసనసభ సమావేశాలను నడుపుతున్నారని టీడీపీ శాసనసభ్యులు ఆరోపించారు. రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు, మాదిగలకు, మాలలకు స్థానం లేకపోవడంపై చర్చించాలంటూ అసెంబ్లీలో సోమవారం పట్టుబట్టిన టీడీపీ శాసనసభ్యులను కొద్దిసేపటికే సస్పెండ్ చేశారు. దీంతో వారు సభలోకి ప్రవేశించే ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సభలో అధికారపక్షం దాడులకు దిగుతున్నదని, సీఎం నియంతృత్వ వైఖరి నశించాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి, ప్రజల సమస్యలను మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కున్నారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కె.పి.వివేకానంద, వెంకటవీరయ్య, గోపీనాథ్, అరికెపూడీ గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇష్టారాజ్యమైపోయింది..
టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సభలో లేరు. ఆలస్యంగా వచ్చిన కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్లను సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే జాబితాలో మంత్రి హరీశ్‌రావు చదవలేదు. దీనితో కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శాసనసభలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఆర్.కృష్ణయ్యను అనుమతించిన అసెంబ్లీ మార్షల్స్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అడ్డుకున్నారు. దాంతో మార్షల్స్‌పై మంచిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇష్టారాజ్యంగా శాసనసభ మారిపోయిందని విమర్శించారు. అయితే టీడీపీ పక్షం నుంచి శాసనసభలో ఆర్.కృష్ణయ్య ఒక్కరే ఉన్నారు.