వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌@2041

Errabelli Dayakar Rao Says, Warangal Master Plan Was Ready Upto 2041 - Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను సమగ్రాభివృద్ధి చేస్తూనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుందని చెప్పారు. వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌ – 2041 ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కూడా) చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్, ‘కూడా’ వైస్‌ చైర్మన్‌ ఎన్‌.రవికిరణ్, పీఓ ఇ.అజిత్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే కొత్త మాస్టర్‌ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఈ సందర్భంగా చెప్పారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు సూచించారు.

భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా...
రాష్ట్రంలో వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్‌. భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా మహా నగరాన్ని అభివృద్ధి చేసేలా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసుకున్నామని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. గతంలో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌–1971ను సరిచేస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌ – 2041 తయారైందని చెప్పారు. వరంగల్‌ సమగ్రాభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించేలా మాస్టర్‌ ప్లాన్‌ ఉందని తెలిపారు.

మూడు జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలో ఉన్నాయని, మొత్తం 1800 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుందని చెప్పారు. గత మాస్టర్‌ ప్లాన్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటుందని వివరించారు. టెక్స్‌టైల్‌ పార్క్, టూరిజం హబ్‌... వంటి అన్ని అంశాలతో వరంగల్‌ ఎకనామిక్‌ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ప్లాన్‌ తయారు చేశామని, ‘కూడా’ పరిధిలో ఉన్న 2 వేల చెరువులను పరిరక్షించేలా చూస్తున్నామని చెప్పారు.

అలాగే, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇన్నర్, ఔటర్, రీజినల్‌ రింగు రోడ్లు.. ఇలా ప్రజల అవసరాల ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు అమలవుతాయని మంత్రి తెలిపారు. ప్రజల సూచనలకు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మార్పులతో తుది ప్లాన్‌ సిద్ధం చేశామని, ఎన్జీవోలు, పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదం కోసం ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో త్వరగా ఆమోదం పొందేలా మున్సిపల్‌ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు.

మునిసిపల్‌ శాఖ పూర్తిగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఈ సందర్భంగా బదులిచ్చారు. ఈ సమావేశానికి ముందు మంత్రి దయాకర్‌రావు ‘కూడా’ చైర్మ న్, అధికారులతో కూడా ఈ విషయమై సమీక్షించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top