రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు | Enraged Chain Snatcher | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

Dec 4 2014 12:05 AM | Updated on Aug 21 2018 6:22 PM

మండలంలో బుధవారం చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు.

తొగుట : మండలంలో బుధవారం చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలకు చెందిన నలుగురు మహిళల తలలపై విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో   కొట్టి వారి మెడల్లోంచి సుమారు 16 తులాల పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో గాయపడిన మహిళలు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు తగరం మల్లవ్వ, తగరం రేఖలు కలిసి ఉదయం వ్యవసాయ బావి వద్దకు బయలుదేరారు.

ఈ క్రమంలో 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు యువకులు ముఖానికి గుడ్డ కట్టుకుని బైక్‌పై వీరి వద్దకు వచ్చి ఇటువైపు ఏదైనా బర్రె కనిపించిందా అంటూ ప్రశ్నించారు. లేదని చెపుతున్న క్రమంలో బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తి దిగి ఇనుప రాడ్‌తో రేఖ, మల్లవ్వ తలలపై బలంగా కొట్టడంతో ఇరువురూ తీవ్ర రక్తస్రావంతో సృ్పహ కోల్పోయారు. వెంటనే రేఖ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడును లాక్కొని అక్కడి నుంచి పారిపోయారు. బాధితులను స్థానికులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి సుమారు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏటిగడ్డకిష్టాపూర్ మదిరా తిరుమగిరి గ్రామానికి చేరుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన బూడిద శోభ, బూడిద మంగవ్వలు వేర్వేరుగా వ్యవసాయ బావిల వద్దకు వెళుతుండగా.. వారిపై కూడా రాడ్డుతో దాడి చేసి ఒక్కొక్కరి మెడలో ఉన్న సుమారు నాలుగు తులాల పుస్తెల తాడు, గుండ్లను ఎత్తుకెళ్లారు. అటు వెళుతున్న వారు బాధితులను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండు గ్రామాల్లో గంటల వ్యవధిలో ఈ సంఘటనలు చోటుచేసుకోవడంతో మండల వ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.

విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ కూరాకుల మల్లేశం, వైస్ చైర్మన్ చిలువేరి మల్లారెడ్డి, సర్పంచులు సునందాబాయి, పుష్పలత, శ్రీనివాస్‌లు ఏరియా ఆస్పత్రికి చేరుకుని గాయాలైన వారిని పరామర్శించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆయా గ్రామాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అనంతరం తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.అడుగడుగునా
పోలీసుల తనిఖీలు : కుకునూర్‌పల్లి, మక్తమాన్‌పల్లి, తొగుట పోలీస్ స్టేషన్ల రహదారులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు   తొగుట సీఐ వెంకటయ్య తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులు, కొత్త వారు కనపడితే తమ దృష్టికి తేవాలని సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement