17న ‘సహకార’ నోటిఫికేషన్‌ | Sakshi
Sakshi News home page

17న ‘సహకార’ నోటిఫికేషన్‌

Published Sun, Jan 6 2019 2:01 AM

Elections of Primary Agricultural Cooperative Societies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌) ఎన్నికలకు ఈ నెల 17న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర సహకారశాఖ రంగం సిద్ధం చేసింది. పంచాయతీ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరి రెండో వారంలో ఒకే రోజున 906 ప్యాక్స్‌లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టి గెలుపొందిన కమిటీని ప్రకటించనున్నారు. ఆ వెంటనే తొమ్మిది డీసీసీబీలు, తొమ్మిది జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలతోపాటు టెస్కాబ్‌ల ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియంతా ఫిబ్రవరి 25కల్లా ముగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకంటే ముందే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ముమ్మరం చేసింది. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా కూడా తుది దశకు చేరుకుంది. రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాల నుంచి ఓటర్ల జాబితా ఎన్నికల అథారిటీకి అందింది. ఇందులో మొత్తం 18 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. మిగిలిన రెండు జిల్లాల నుంచి కూడా జాబితా వస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. సహకార సంఘంలో ఏడాది, అంతకంటే ఎక్కువ కాలం మెంబర్‌గా కొనసాగిన వారినే ఓటరుగా గుర్తించనున్నారు. పూర్తిస్థాయిలో అన్ని జిల్లాల నుంచి ఓటర్ల జాబితా రాష్ట్ర సహకారశాఖ రిజిస్ట్రార్‌ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. వాటన్నింటిపై రాష్ట్రస్థాయిలో సహకారశాఖ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది.

ఆ తరువాత తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్యాక్స్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జీలు పాలక వర్గాలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి గతేడాది జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో కొన్ని ప్యాక్స్‌లకు పదవీకాలం ముగిసింది. దీంతో ఫిబ్రవరి రెండోవారంలో ఎన్నికలను నిర్వహించే సమయానికి పర్సన్‌ ఇన్‌చార్జీల పాలనకు సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచి ఇవ్వనున్నారు. గతంలో ఎన్నికల అధికారి ప్రతిపాదనలు సమర్పించి సొసైటీ నుంచే ఖర్చు చేసే విధానం ఉండేది. అయితే అందులో లోటుపాట్లు, అవినీతి చోటుచేసుకుంటున్నందున ఇటీవల ఎన్నికల నిబంధనల్లో భాగంగా ఈ మేరకు సవరణ తీసుకువచ్చారు. 50 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న సొసైటీలకు చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా భద్రాచలం ప్యాక్స్‌కు చేతులెత్తే విధానంలోనే ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు... 
ప్యాక్స్‌ ఎన్నికలకు 12 వేల బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 40 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వివిధ శాఖల ఉద్యోగులు ప్యాక్స్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్ల కోసం పంచాయతీ ఎన్నికల్లో తమ శాఖ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే సహకారశాఖ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 

Advertisement
Advertisement