నేతల వలలో పడబోతున్న ఓటర్లు..

Election Candidates Attracting The Voters In Warangal  - Sakshi

మూగబోయిన మైకులు.. 

ధన, వస్తు ప్రవాహానికి తెరలేపిన అభ్యర్థులు

ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు

మహిళా, కుల సంఘాల వారీగా నజరానాలు 

సాక్షి, భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగియడంతో పచ్చ నోట్ల పర్వానికి తెరలేచింది. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు తమ తమ అనుచర గణంతో చీకటిమాటు వ్యవహారానికి తెరలేపారు. జిల్లా పరిధిలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇక్కడ గెలుపోటములపై డబ్బులు ప్రభావం చూపించే పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు ఓటుకు భారీ ఎత్తున నజరానా లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
పోటాపోటీగా సాగిన ప్రచారం..పక్షం రోజుల నుంచి జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచార పర్వానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అసెంబ్లీ రద్దు చేసిన నాటి నుంచి గ్రామాలు, పట్టణా ల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు మొదలు పెటా ్టరు.

ఎన్నికల నిర్వహణకు నవంబర్‌ 12న నోటిఫికేషన్‌ వెలువడగా, అదే నెల 22 వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల నుంచి 26 మంది బరిలో మిగిలారు. అభ్యర్థులతోపాటు వారికి మద్దతుగా వచ్చిన పార్టీల నాయకుల ప్రచారంతో హోరెత్తిపోయింది. ఈ నెల 7న పోలింగ్‌ ఉన్నందున ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 24 గంటల ముదే ప్రచారాన్ని నిలిపివేశారు. చివరి రోజు అన్ని పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి చిట్యాల, గణపురం, కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మండల పరిధిలో, ములుగు పట్టణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క, మహ్మద్‌గౌస్‌పల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చందూలాల్‌ ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి జిల్లా కేంద్రంలో బహిరంగ సభ, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు గణపురంలో రోడ్‌ షోలో పాల్గొనగా వీరితోపాటు బీఎల్‌ఎఫ్, ఇండిపెండెట్‌ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.

మూగబోయిన మైకులు 
భూపాలపల్లి, ములుగు నియోజవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మంది మార్బలంతో వాడవాడలా ప్రచారంతో హోరెత్తించారు. టాటాఏసీలు, డీసీఎం వ్యాన్‌లు, బులెరో వాహనాపై మైకులు, డీజే బాక్సులు ఏర్పాటు చేసి పాటలు, నినాదాలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రతి వీధిలో ఏదో ఒక పార్టీకి చెందిన మైకుల మోత మోగించారు. అభ్యర్థుల ప్రచారంతో దద్ధరిల్లిన జాల్లా ఒక్కసారిగా మూగబోయింది. ప్రచార వాహనాలు పార్టీల కార్యాలయాలకు చేరుకున్నాయి. ఓటింగ్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండడంతో స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలిపెట్టారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు మాత్రమే ఉండడానికి వీలు ఉంది. దీనితో ఇన్ని రోజులు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసిన నాయకులు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రచారం ఆగిపోవడం.. స్థానికేతరులు వెళ్లిపోవడంతో నియోజకవర్గాల్లో అంతా గప్‌చూప్‌గా మారింది. 

ప్రశాంత వాతావరణంలో..
అన్ని పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించగా శాంతిభద్రతల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు ముఖ్యనేతలు హాజరయ్యారు. రోడ్‌ షోలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ విజ యవంతంగా ముగియడానికి పోలీసులు తమదైన శైలిలో వి«ధులు నిర్వర్తించి విజయం సాధించారు. ములుగు నియోజకవర్గంలోని వెంకటాపూర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ అసమ్మతి నాయకులు, చందూలాల్‌ వర్గీయుల మధ్య జరిగిన గొడవ మినహా ఎక్కడా ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని చెప్పవచ్చు. 

ప్రలోభాల పర్వం..
పోలింగ్‌కు ఇక ఒక రోజే సమయం మిగిలి ఉండడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మందు, నజరానాలు, డబ్బు పంపకాలను ప్రారంభించినట్లు సమాచారం.  కుల, మహిళా సంఘాలు, ఇతరత్రా వర్గాల ఓట్ల శాతా న్ని బట్టి పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది.   స్వయం సహాయక సంఘాల సభ్యుల వారీగా జాబితా తయారు చేసుకుని పంపకాలు చేపట్టినట్లు సమాచా రం. సంఘం సభ్యురాలి కుటుంబంలో ఎంత మంది ఓట ర్లు ఉన్నారో వివరాలు తీసుకుని ఒక్కో ఓటుకు రూ.500నుంచి రూ.2000 వరకు పంచుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు గెలిస్తే కమ్యూనిటీ భవనం నిర్మించడం ఇతరత్రా హామీలు గుప్పిస్తూ.. ఇతర వర్గాలకు ప్రస్తుతం నగదుతో విందులు ఏర్పాటు చేసుకునేందుకు ఆఫర్‌లు ఇస్తున్నట్లు సమాచారం.
 
  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top