
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), బార్క్ (డీఏఈఆర్ అండ్ డీ ల్యాబ్) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సీకర్ విజయవంతమైనట్లు సంస్థ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే సీకర్ తయారీలో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ముఖ్యపాత్ర పోషించినట్లు పేర్కొన్నాయి. ఈ నెల 22న రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్టు రేంజ్ బ్రహ్మోస్ పరీక్షల్లో సీకర్‌ను అమర్చి నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు వెల్లడించాయి.
ఈ ప్రయోగంలో డీఆర్‌డీవో, ఈసీఐఎల్, బార్క్ అధికారులతో పాటుగా ఇండియన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నట్లు తెలిపాయి. దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో సీకర్‌కు సంబంధించిన చిత్రాలను విడుదల చేయడం లేదన్నారు. శత్రువుల కదలికలను, వారి స్థావరాలను పక్కాగా గుర్తించి లక్ష్యాన్ని చేరుకోవడం దీని ప్రత్యేకతని తెలిపాయి.