ఎంసెట్ ఉండాల్సిందే | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ఉండాల్సిందే

Published Fri, Dec 19 2014 1:49 AM

ఎంసెట్ ఉండాల్సిందే - Sakshi

  • ప్రభుత్వానికి నివేదించిన ఉన్నతాధికారుల కమిటీ
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షను ఇకముందూ కొనసాగించాల్సిందేనని ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌తో సహా ఉన్నత విద్యారంగంలో ప్రైవేటు రంగందే పైచేయిగా ఉండడం వల్ల ఎంసెట్ రద్దు విపరిణామాలకు దారితీస్తుందని కమిటీ అభిప్రాయపడింది.

    ఇంజనీరింగ్, ఫార్మా ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్‌తో పాటు ఉన్నత విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ .ఎం.డోబ్రియాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఆరుగురు సభ్యుల బృందాన్ని సెప్టెంబర్ 19న ఏర్పాటు చేసింది. కమిటీలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ విద్యా గెడైన్స్ అధికారి ఆర్.డేవిడ్ కుమార్‌స్వామి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ డిప్యుటీ డైరక్టర్ ఎస్పీ శ్రీకాంత్‌లను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ తమిళనాడులో పర్యటించి అక్కడి ఇంటర్మీడియెట్ విద్య, ఉన్నత విద్య, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అధ్యయనం చేసి వచ్చింది. ఇటీవలే ఈ నివేదికను డోబ్రియాల్ ప్రభుత్వానికి సమర్పించారు.

    ఆనివేదిక ప్రకారం ‘ఇంటర్మీడియెట్, ఉన్నత విద్య, సాంకేతిక విద్యారంగాలకు సంబంధించి తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్‌కు వ్యత్యాసముంది. తమిళనాడు విద్యారంగంలో ప్రభుత్వ పరిధే ఎక్కువ. స్కూళ్లు కాలేజీల్లో 85  శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. దీంతో పాటు అక్కడి పరీక్షల విధానం కూడా ఎంతో పకడ్బందీగా అమలవుతోంది. అక్రమాలకు తావులేకుండా కఠినమైన పద్ధతులను అక్కడ అమలు చేస్తున్నారు. ఏపీలో అందుకుభిన్నంగా స్కూళ్లు, ఇంటర్మీడియెట్ కాలేజీల్లో 80 శాతానికి పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి.

    తమిళనాడులో ఇంజనీరింగ్, ఫార్మాకోర్సుల్లో ప్రవేశానికి ఏపీలో మాదిరిగా ఎంసెట్  వంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఎంసెట్‌తో పనిలేకుండా ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఇంటర్మీడియెట్ కాలేజీలు అత్యధికం ప్రభుత్వానివే అయినందున ఆ పబ్లిక్ పరీక్షలు పగడ్బందీగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కొనసాగుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ పరిధి తక్కువగా ఉండి ప్రైవేటు భాగస్వామ్యమే ఎక్కువైంది. ఈ తరుణంలో ఎంసెట్ పరీక్ష రద్దు చేయడం సరికాదు.

    ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కల్పన వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. గ్రా మీణ, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకన్నా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లోని పిల్లలకే ఇంటర్మీడియెట్ మార్కులు అధికంగా తెప్పించుకొని ఇంజనీరింగ్ సీట్లు వారికే కేటాయింపులు జరుగుతాయి. దీంతో గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులు నష్టపోతారు.  ఎంసెట్‌ను యధావిథిగా కొనసాగించడం అనివార్యం’ అని సూచించినట్టు అధికారవర్గాలు తెలిపాయి
     
    ఉమ్మడి  ఎంసెట్ తప్పదు

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడిగానే ఎంసెట్‌ను నిర్వహించాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యా ప్రవేశాలు ఉమ్మడిగా జరగాలని విభజన చట్టంలో ఉందని, ఎంసెట్ అనేది ప్రవేశాలకు సంబంధించినదే కనుక పరీక్షను ఉమ్మడిగానే నిర్వహించకతప్పదని చెబుతున్నారు.

    ఇంటర్మీడియెట్ పరీక్షలు వేర్వేరుగా జరుగుతున్నందున మూల్యాంకనం, మార్కులివ్వడంపై ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రానికి అనుమానాలు తలెత్తే పరిస్థితి ఉంటుందని, ఈ తరుణంలో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం పూర్తిగా రద్దుచేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తే ఎలాంటి వివాదాలకూ తావుండదని పేర్కొంటున్నారు.
     

Advertisement
Advertisement