వైభవం.. ధ్వజారోహణం

Dwajarohanam Grandly celebrated in Bhadrachalam - Sakshi

శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ఠ

గరుడ ముద్ద స్వీకరణకు పోటాపోటీ..

భారీగా హాజరైన భక్తజనం

నేడు ఎదుర్కోలు ఉత్సవం  

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త  నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవిఘ్నాలు చోటుచేసుకోకుండా, ఆలయానికి రక్షణగా ధ్వజస్తంభం వద్ద శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీన్నే ధ్వజారోహణంగా వ్యవహరిస్తారు. ఆలయంలో ఉదయం తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిగింది.

అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన చేశారు. కర్మణ, పుణ్యాహవచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన, తోరణ ఆరాధన నిర్వహించారు. అనంతరం నవాహ్నిక దీక్షకు అగ్ని మథనం గావించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన జరిపి, హోమం చేశారు.   

గరుడాళ్వార్లకు ప్రత్యేక ఆహ్వానం..
ముందుగా ప్రధాన ఆలయం నుంచి వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య సమస్త రాజ లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్సవ మూర్తులైన శ్రీసీతారామ లక్ష్మణ స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షణ చేయించి ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం జరిపి అర్చక, పరిచారక, వేద పండితులు తీసుకొని రాగా.. బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను అర్చకులు పఠించగా, మంగళ వాయిద్య ఘోష నడుమ గరుడ పటాన్ని పైకి ఎగురవేశారు.

అనంతరం బలిహరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతాన లేని వారికి గరుడ ముద్దలను అందజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. దీంతో ఈ ప్రసాదాలను స్వీకరించేందుకు మహిళలు ఆసక్తి చూపించారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. అష్టదిక్పాలక, దేవతాహ్వానం గావించారు. ఉత్సవ మూర్తులతో పాటు ఎనిమిది దిక్కులకు బలిహరణం వేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రబాకర శ్రీనివాస్‌ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఇతర అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.  

నేడు ఎదుర్కోలు ఉత్సవం...
స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఎదుర్కోలు వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం చతుఃస్థానార్చన పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి వారికి ఉత్తర ద్వారం ముందు భాగంలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం గరుడ సేవ జరపనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top