తాగిన మైకంలో స్నేహితుడి హత్య | Drunken friend's murder | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో స్నేహితుడి హత్య

Jan 11 2015 4:23 AM | Updated on Aug 11 2018 8:11 PM

తాగిన మైకంలో స్నేహితుడి హత్య - Sakshi

తాగిన మైకంలో స్నేహితుడి హత్య

తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్నేహితుడినే కొట్టి చంపిన సంఘటన సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ కథనం ప్రకారం..

సిరిసిల్ల: తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి స్నేహితుడినే కొట్టి చంపిన సంఘటన సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. సంజీవయ్యనగర్‌కు చెందిన నీరటి అరుణ్‌కుమార్(28)  మంగళవారం రాత్రి హత్యకు గురయ్యాడు. అరుణ్‌కుమార్‌ను తోటి స్నేహితుడు కొంపెల్లి  విజయ్‌కుమార్(32) కొట్టి చంపారు. మంగళవారం ఉదయం అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌లు సిరిసిల్ల నుంచి బోయినపల్లి మండలం వర్దవెల్లికి వెళ్లారు.

అరుణ్‌కుమార్ నానమ్మ పింఛన్ విషయమై మాట్లాడి, మధ్యమానేరు పరిహారం గురించి ఊరిలో చర్చించారు. అక్కడే ఇద్దరూ మద్యం తాగి సిరిసిల్లకు చేరుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మళ్లీ రెండోసారి మద్యం తాగి కల్లు తాగేందుకు అంబికానగర్‌లోని కల్లు కంపౌండ్‌కు వెళ్లారు. అక్కడ కల్లు తాగుతున్న క్రమంలో అరుణ్‌కుమార్ సెల్‌ఫోన్ పోయింది. సెల్‌ఫోన్ ఏమైందని కల్లుతాగుతున్న వారిని అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌లు తనిఖీ చేశారు. ఫోన్ జాడ తెలియక పోవడంతో అరుణ్‌కుమార్ కోపంతో ఊగిపోయారు.

ఈ క్రమంలో స్నేహితులైన అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌ల మధ్య ఘర్షణ జరిగింది. కల్లు దుకాణం నిర్వాహకులు ఇద్దరిని బయటికి పంపించడంతో రాజీవ్‌నగర్ వెళ్లిన ఇద్దరు పరస్పరం కొట్టుకున్నారు. ఈ క్రమంలో అరుణ్‌కుమార్ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేసి నిందితుడు విజయ్‌కుమార్‌ను శనివారం అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్ తెలిపారు. గతంలోనూ విజయ్‌కుమార్‌పై పోలీసు కేసులున్నాయని సీఐ వివరించారు.  తాగిన మైకంలోనే విచక్షణ కోల్పోయి అరుణ్‌కుమార్‌ను విజయ్‌కుమార్ హత్య చేసినట్లు సీఐ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement