కళ తప్పిన కాంగ్రెస్ | drought to captain of congress | Sakshi
Sakshi News home page

కళ తప్పిన కాంగ్రెస్

May 25 2014 2:30 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఓ కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, శాసనసభ ఉపసభాపతి వంటి కీలక పదవులు చేజిక్కించుకొని రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నేడు కళ తప్పింది.

ఖమ్మం, న్యూస్‌లైన్: ఓ కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, శాసనసభ ఉపసభాపతి వంటి కీలక పదవులు చేజిక్కించుకొని రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నేడు కళ తప్పింది. పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరపకపోవడం, దీనిని భర్తీ చేసేందుకు వేసిన సమన్వయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచినా.. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది.

కొత్తగా గెలిచిన వారు తప్ప మిగిలిన వారు కనీసం కార్యకర్తలతో సమావేశం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు చెబుతున్నారు. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన స్థానాల్లో ఆ పార్టీ కూడా ఘోర పరాభవం చవిచూడటంతో అక్కడ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని పలువురు సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 సారధి లేడు...
 జాతీయ పార్టీ, చెక్కుచెదరని ఓటు బ్యాంకు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కరువయ్యాడు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు అధ్యక్షుడిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు పార్టీని వీడడంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని ఇంకా భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు భర్తీ చేద్దామని తెలంగాణ పీసీసీ భావించినా  జిల్లాపార్టీలోని వర్గ విభేదాలతో... అటు  రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇటు  రేణుకాచౌదరి వర్గాలలో ఎవరికీ అధ్యక్షపదవి కట్టబెట్టలేక తాత్కాలికంగా ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే  ఈ కమిటీలో ఉన్న సభ్యుల మధ్యే సమన్వయం లోపించిందని, ఈ కమిటీతో ఎటువంటి పని జరగలేదనే విమర్శలు వచ్చాయి. కీలకమైన ఎన్నికల సమయంలో కూడా ఈ కమిటీ సమావేశం కాకపోవడం విశేషం.

అయితే కమిటీ సభ్యులు నామ మాత్రమే అని.. వారి మాట వినేవారు ఏరని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగుతుందని గతంలో ప్రచారం కాగానే... పదవికోసం క్యూ కట్టిన నాయకులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధికారంలో లేదు... అధ్యక్ష పదవి తీసుకుంటే అన్ని మీదవేసుకుని పనిచేయాలి.... ప్రతిపక్ష పార్టీగా కార్యక్రమాలు చేయాలి... అనే ఆలోచనతో గతంలో అధ్యక్ష పదవికోసం గాఢ్ ఫాదర్స్ చుట్టు తిరిగిన వారు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని ప్రచారం. కాగా, ఇంతకాలం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధ్యక్షుడు లేకపోయినా పని జరిగేదని.. ఇప్పుడు అధ్యక్షుడు లేకుండా పార్టీ మనుగడ ఇబ్బందికరమని కార్యకర్తలు అంటున్నారు.

 గెలిచిన ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం..
 హోరాహోరీ పోటీని ఎదుర్కొని గెలిచినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నిరుత్సాహమే మిగిలింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గం నుంచి మొన్నటి వరకు మంత్రిగా కొనసాగిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్కలకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కీలక పదవులు లభించేవి. కానీ అంతా తారుమారై తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. దీంతో వారిలో, వారి అనుచరగణంలోనూ నిరుత్సాహం నెలకొంది. నూతనంగా గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు మాత్రం గెలిచిన నాటి నుంచి కార్యకర్తలను కలవడం, అభినందన సభల్లో పాల్గొనడంతోనే సరిపెట్టుకుంటున్నారు. మరోవైపు జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ కనీస ఉనికిని కూడా చాటుకోలేదు.

 ఇక అశ్వారావుపేట, భద్రాచలం మాజీ ఎమ్మెల్యేలకు క్యాడర్ దూరమయింది. పొత్తులో భాగంగా పినపాకను సీపీఐకి కేటాయిండంతో అలిగిన  రేగ కాంతారావుకు సముచిత స్థానం కల్పిస్తామన్న అధిష్టానం చతికిల పడటంతో ఆయన భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా మారింది. ఇలా గెలిచిన వారు, ఓడిన వారు అంతా నిరుత్సాహంతో ఉండటంతో కార్యకర్తలు ప్రత్యామ్నాయం వైపు  చూడాల్సి వస్తోందని జిల్లా రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement