రిజిస్ట్రేషన్లకు  ఆటంకాలెన్నో..!

Documents Registration Problems In Adilabad - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌ : తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా మూడుచోట్ల ప్రారంభించగా, నామమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కొత్తగా ఈ ప్రక్రియ ప్రారంభించడంతో రానురాను గాడిలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ధరణి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడం తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆటంకమవుతుందని అధికారుల నుంచి వినిపిస్తున్న వాదన. లోపభూయిష్టంగా ఉన్న ఈ విధానం కారణంగా ఒత్తిడిలో పనిచేయలేమని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 20 నుంచి ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.  

నామమాత్రంగా.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మే 19న మూడు తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్, నిర్మల్‌ జిల్లా నిర్మల్‌రూరల్, మంచిర్యాల జిల్లా నెన్నెల తహసీల్దార్‌ కార్యాలయాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. గుడిహత్నూర్, నెన్నెలలో నామమాత్రంగా రిజిస్ట్రేషన్లు కాగా, నిర్మల్‌రూరల్‌లో కొంత పర్వాలేదనిపించింది. అయితే అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో ఆయా కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బంది సహకారంతోనే తహసీల్దార్లు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం కూడా ఆటంకం కలిగిస్తుంది. ప్రధానంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి ప్రతీ అంశంలో ఒక్కో సిబ్బంది అందుబాటులో ఉంటారు.

తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌తో పాటు ఆపరేటర్, సబార్డినేట్‌ మినహా ఇతర సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ప్రస్తుతం ధరణి ప్రాజెక్టు కింద భూ వివరాలను క్రోడీకరించడం రెవెన్యూ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా ఉంది. ప్రస్తుతం పాస్‌పుస్తకాల్లోనూ పెద్ద ఎత్తున తప్పులు దొర్లడంతో వాటిని సవరించే ప్రక్రియ చేపడుతున్నారు. ఇటు రెవెన్యూకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న అధికారులు రిజిస్ట్రేషన్‌ మీద దృష్టి సారించలేకపోతున్నామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ రిజిస్ట్రేషన్లు చేపడదామన్నా ధరణికి సంబంధించి వెబ్‌సైట్‌ పూర్తిగా సిద్ధం కాకపోవడం పెద్ద ఆటంకంగా మారింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఇతర అంశాల పరంగా ప్రక్రియలను చేపట్టలేకపోతున్నారు. పట్టా మార్పిడి ఆప్షన్‌ ఇప్పటికీ రానట్టు చెబుతున్నారు. అదేవిధంగా కరెక్షన్లకు సంబంధించి ఎలా చేపట్టాలో స్పష్టత లేకపోవడం కూడా సిబ్బంది ఇబ్బందులకు కారణమవుతోంది. ఒక రిజిస్ట్రేషన్‌ను రద్దు (క్యాన్సలేషన్‌) చేయాలన్న దానికి కూడా ఆప్షన్‌ రావడం లేదని అధికారులు చెబుతున్నారు.

దీంతో ప్రతీ అంశంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిపై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో రిజిస్ట్రేషన్‌ చేపడతామన్న ధీమా కనపడటం లేదని ఓ అధికారి చెప్పారు. ధరణి వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చనందునా అన్నిరకాల సవరణలు చేసే అవకాశం అమల్లోకి రాలేదని, వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్‌లు కూడా సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ధరణి వెబ్‌సైట్‌ నిర్వాహకులు నియమించిన సిబ్బందికి సరైన నైపుణ్యత లేదని, కావాల్సిన అర్హతలు కూడా వారికి లేవని అధికారులు చెబుతున్నారు. వారిని వెంటనే వెనక్కి పంపించి నిపుణులను ఎంపిక చేసే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వాలని అభిప్రాయ పడుతున్నారు. ధరణి వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతలను అప్పగించాలని చెబుతున్నారు. అంతకుముందు సిబ్బంది, మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు.  

ఒత్తిడి.. 
ఓ వైపు రెవెన్యూ సంబంధిత పనుల్లో బిజీగా ఉంటూ మరోపక్క రిజిస్ట్రేషన్‌ చేపట్టడం తలకుమించిన భారంగా మారుతుందన్న అభిప్రాయం తహసీల్దార్లలో వ్యక్తమవుతుంది. రెవెన్యూ ఏతర పనులను తహసీల్దార్ల నుంచి, రెవెన్యూ సిబ్బంది నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న రెవెన్యూ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో దరఖాస్తుదారుడు డాక్యుమెంట్‌లో సూచించిన విధంగా మోకా(స్థలం) మీద పరిశీలన జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్‌ రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు.

స్థలాన్ని పరిశీలించిన పక్షంలో డాక్యుమెంట్లో పొందుపర్చిన అంశాలు పూర్తిగా సరైనవా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా డాక్యుమెంటేషన్‌లో భూమి విస్తీర్ణం అధికంగా చూపడం, మోకా మీద భూమి తక్కువగా ఉండటం అంశాల కారణంగా అమ్మకం, కొనుగోలుదారుల మధ్య విభేదాలు చోటుచేసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయాలకు ఈ బాధ్యతను అప్పగించిన తర్వాత అయినా స్థల పరిశీలన చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం లేకపోలేదు. అదే సమయంలో తహసీల్దార్‌లపై కూడా రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.  

ధరణి పూర్తయితేనే  రిజిస్ట్రేషన్లు 
ధరణి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేపట్టడం సులువుగా ఉంటుంది. గతంలో ఉన్న వెబ్‌ల్యాండ్‌ పిరియడ్‌ అయిపోయింది. ధరణికి సంబంధించి అన్ని అంశాలు ఆన్‌లైన్‌లో రాకపోవడం ఇబ్బందిగా ఉంది. పట్టా మార్పిడి ఆప్షన్‌ లేదు. సవరణ చేద్దామన్నా ఆ ఆప్షన్‌ కూడా లేదు. రిజిస్ట్రేషన్‌ క్యాన్సలేషన్, ఇతరత్రా అంశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బంది సహకారం తీసుకొని ప్రస్తుతం చేపడుతున్నాం.    – మోతీరాం, తహసీల్దార్, గుడిహత్నూర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top