20 నుంచి హజ్‌యాత్రకు దరఖాస్తుల పంపిణీ

Distribution of applications for Hajj yatra from 20th - Sakshi

యాత్రకు వెళ్లే వారు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకోండి: హజ్‌ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: హజ్‌ యాత్ర–2019కి సంబంధించి ఈ నెల 20 నుంచి దరఖాస్తులు పంపిణీ చేసేందుకు కేంద్ర హజ్‌ కమిటీ ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మసీవుల్లా ఖాన్, ప్రత్యేకాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ఏ షుకూర్‌ తెలిపారు. కేంద్ర హజ్‌ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర హజ్‌ కమిటీ సైతం దరఖాస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గురువారం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో హజ్‌యాత్రకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

హజ్‌ యాత్ర–2019కి వెళ్లే వారు తమ పాస్‌పోర్టులను సిద్ధం చేసుకోవాలని, పాస్‌పోర్టు గడువు 2020 మార్చి వరకు ఉండాలన్నారు. లేని పక్షంలో రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. హజ్‌ యాత్ర–2018కి సంబంధించి రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 7,347 మంది యాత్రికులు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాలకు వెళ్లారన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 4,453, ఏపీ నుంచి 1,711, కర్ణాటక 4 జిల్లాల నుంచి 1,183 మంది ఆగస్టు 1న 25 విమానాల్లో వెళ్లినట్లు తెలిపారు.

హజ్‌ ఆరాధనలు పూర్తి చేసుకొని గత నెల 12 నుంచి 25వ తేదీ వరకు 7,301 మంది యాత్రికులు నగరానికి చేరుకున్నట్లు తెలిపారు. ఇందులో ఐదుగురు అనారోగ్యంతో మృతి చెందగా, మరోకరు అనారోగ్యంతో మదీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇక మరో 36 మంది హజ్‌ షెడ్యూల్‌కు ముందే నగరానికి రాగా.. నలుగురు యాత్రికులు గురువారం నగరానికి చేరుకున్నట్లు తెలిపారు. 2018 హజ్‌ యాత్రకు సహకరించిన వారికి అక్టోబర్‌ రెండో వారంలో సన్మానం చేస్తామని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top