జెండాలు వేరు..  ఎజెండా ఒక్కటే!

Devided by Partys, United by Problems - Sakshi

పాలమూరు– రంగారెడ్డి పూర్తి, 111 జీఓ ఎత్తివేత  

జోన్‌ మార్పు, కంది బోర్డు ఏర్పాటు, యువతకు ఉపాధి 

అన్ని పార్టీలవీ ఒకే హామీలు 

ప్రచార అస్త్రాలుగా ప్రధాన సమస్యలు 

ఎవరికి వరమిస్తారో.. ఓటరు దేవుళ్లు! 

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఈ తక్కువ సమయంలో వీలైనంత అధిక సంఖ్యలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. వీరి పార్టీల జెండాలు వేరైనా.. ఎజెండా మాత్రం ఒక్కటే. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలే వీరి ప్రచార అస్త్రాలుగా మారాయి. ఎక్కడికి వెళ్లినా వీటిని పరిష్కారం చేస్తామని హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

అభ్యర్థుల హామీలు ఇంచుమించు ఒకేతీరుగా ఉండటంతో ఓటర్లు ఆలోచనలో పడ్డారు. ఇచ్చిన మాటకు ఎవరు కట్టుబడి ఉంటారోనని లోతుగా విశ్లేషిస్తున్నారు. అభ్యర్థుల వ్యక్తిత్వం, రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం, ప్రజాసేవ, ప్రజల్లో నమ్మకం, నాయకత్వ లక్షణాలు, స్థానికత, గుర్తింపు, చరిష్మా, రాజకీయపార్టీ తదితర కోణాలను పరిశీలిస్తున్నారు. వీటన్నింటిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే సరైన అభ్యర్థికి ఓటు వేస్తామని చెబుతున్నారు. ఓటర్ల అభిమతం ఇలా ఉండగా.. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమ శక్తి మేరకు హామీలను నెరవేర్చుతామన్న భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.  

అందరి ఎజెండా ఇదే 

జోనల్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాలలో కలిపారు. గతంలో ఈ ప్రాంతం ఆరో జోన్‌లో కొనసాగింది. కొత్త జోన్‌లో కలపడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను చార్మినార్‌లో కొనసాగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని మూడు ప్రధాన పార్టీలు హామీ ఇస్తున్నాయి.  
చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరంలో కొంతభాగం మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రజలకు జీవనాధారం వ్యవసాయమే.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి çముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రాణహిత–చేవెళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించి అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతాల్లోని 2.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టింది. చేవెళ్ల ప్రాంతాన్ని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి తొలగించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో చేవెళ్ల ప్రాంతం లేదని, కృష్ణానది బేసిన్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నుంచి నీరిచ్చేలా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌కు డిజైన్లు చేశారు. రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయంచారు.

అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయింది. అయితే చేవెళ్ల లోకసభ పరిధిలోని ప్రాంతాలకు నిర్దేశించిన 19, 20, 21 ప్యాకేజీల పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండటాన్ని గుర్తించిన అభ్యర్థులు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది. ఇందుకు కోసం ఎన్ని నిధులనైనా ఖర్చు చేస్తామంటోంది. ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. అవరసమైతే ఎంతవరకైనా ఉద్యమిస్తామంటోంది. ఇక బీజేపీ పార్టీ కూడా ఇదే కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రచారం చేస్తోంది. 

తాండూరులో ప్రధాన పంట కంది. ఏటా పెద్ద ఎత్తున పంట దిగుబడి వస్తున్నా రైతులకు సరైన దక్కడం లేదు. దీంతో కంది బోర్డు ఏర్పాటు చేస్తే తమకు న్యాయం జరుగుతుందని ఈ ప్రాంత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై గతంలో ఆయా పార్టీలు హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఎన్నికల వేళ కంది ఏర్పాటు అంశంపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి కంది బోర్డు ఆశయం నెరవేర్చుతామని భరోసా కల్పిస్తున్నాయి.  

 శేరిలింగంపల్లి నుంచి వికారాబాద్‌కు ఎంఎంటీఎస్‌ విస్తరణ హామీ నీటిమీది రాతగానే మారిపోతోంది. ఏళ్లనాటి ఈ ఆకాంక్షని మొన్నటి వరకు రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకోనేలేదు. ఎంఎంటీఎస్‌ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నాయి.  

వికారాబాద్‌ శాటిలైట్‌ పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. నెలలు గడుస్తున్నా రెండు అడుగులు ముందుకు.. మూడడుగులు వెనక్కి చందంగా మారింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి. 

నాపరాతికి పేరుగాంచిన తాండూరు ప్రాంతం పూర్తి కాలుష్యమయమైంది. ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చడమనేది గగనం. అధికసంఖ్యలో ఉన్న నాపరాతి పరిశ్రమలు, గ్రానైట్‌ క్వారీల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాల నుంచి స్థానికులు ఆరోగ్యం పాలవుతున్నారు. అయితే కాలుష్య నియంత్రణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తున్నా చలనం కరువైంది. దీనిపై ఆయా పార్టీలు స్పందిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాయి.

రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్‌కు తాగునీరందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరిధిలోని ఆ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. దీంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్నా అభివృద్ధి పరంగా చాలా వెనకబడ్డామని స్థానికులు కలత చెందుతున్నారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన ఈ జీఓను ఎత్తివేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో జీఓను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఈ దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా.. 111 జీఓ పరిష్కారానికి నిపుణల కమిటీతో అధ్యయనం చేయించి, న్యాయపరమైన, పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని ఆ పార్టీ హామీ ఇస్తోంది. తాము గెలిస్తే వెంటనే జీఓ రద్దు చేస్తామని కాంగ్రెస్, బీజేపీలు పేర్కొంటున్నాయి.  

చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ ప్రాంతంలో 8 శాతం మందే వేతన జీవులు ఉండటం గమనార్హం. స్థానికంగా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని స్థానికులు చెబుతున్నారు. వీరి కోరిక మేరకు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top