ఉసురు తీస్తున్నారు..!

ఉసురు తీస్తున్నారు..! - Sakshi


 జిల్లాలో ఆగని భ్రూణహత్యలు

 

మురుగుకాల్వలు, ముళ్లపొదలపాలవుతున్న ఆడశిశువులు

స్కానింగ్ కేంద్రాల ఇష్టారాజ్యం ఆడ మైనస్.. మగ ప్లస్ సంకేతాలు!

పట్టించుకోని వైద్యారోగ్యశాఖ

 


మహబూబ్‌నగర్ క్రైం: ఆడబిడ్డను కడుపులోనే తుంచేస్తున్నారు.. పొత్తిళ్లలో పొదిగిన శిశువును మురుగునీటి కాల్వల్లో విసిరేస్తున్నారు.. లేదంటే ముళ్లపొదల పాలుచేస్తున్నారు.. కాదంటే బస్టాండ్ ప్రాంతాల్లో వదిలివెళ్తున్నారు.. ఇదీ జిల్లాలో ఆడశిశువులకు రాస్తున్న మరణశాసనం. కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో ఆ పసిమొగ్గలు  ఆదిలోనే రాలిపోతున్నాయి. జిల్లాలో రోజుకు సగటున రెండొందల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా. వారిలో ముగ్గురికి పైగా చిన్నారులు మృతి చెందుతున్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.ఈ మరణాల సంఖ్య కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనివే.. ప్రైవేట్ ఆస్పత్రులు, ఇళ్లవద్ద ప్రసవాల్లో చనిపోతున్న చిన్నారుల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందకపోవడం, ఆక్సిజన్, వెంటిలేటర్లు నెల తక్కువగా పుట్టడం, ఊపిరితిత్తుల సమస్యలు, బరువు తక్కువ వంటి కారణాలతో ఎక్కువ మంది చిన్నారులు పుట్టగానే మరణిస్తున్నారు. వీరిలో 65శాతం ఆడ శిశువులే ఉండడం గమనార్హం.
 యథేచ్ఛగా లింగనిర్ధారణ

జిల్లాలో 85ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 12ప్రాంతీయ ఆస్పత్రులతో పాటు జిల్లాసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయి. వైద్యుల కొరత, పరికరాలు లేకపోవడం, సంరక్షణ తదితర కారణాలతో ఎక్కువమంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల క్రితం 40 మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాలు ప్రస్తుతం 140 ఉన్నాయి. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే స్కానింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తారు. మహిళలు గర్భం దాల్చినప్పుడు పిండం ఎదుగుదల, గర్భసంచి పరిణామం, వ్యాధులు, సమస్యలు మాత్రమే చెప్పాలి. కానీ కొందరు లింగ నిర్ధారణ ఫలితాలు చెప్పేస్తున్నారు.    

 ఆడ మైనస్.. మగ ప్లస్!

 జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న కొందరు తల్లిగర్భంలోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ పట్టణంతో పాటు నారాయణపేట, వనపర్తి, కొత్తకోట, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, కల్వకుర్తి ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గ్రామీణవైద్యులు, వారి వద్ద పనిచేసే సిబ్బంది డబ్బులు ఆశపడి నిర్వాహకులతో కుమ్మక్కై పుట్టబోయే వారి వివరాలు వెల్లడిస్తున్నారు. అయితే స్కానింగ్ కేంద్రాలకు వెళ్లిన వారికి పుట్టబోయేది ఆడ శిశువు అయితే ‘మైనస్’ అని, మగబిడ్డ అయితే ‘ప్లస్’ అని ప్రత్యేకంగా సూచికలు ఇస్తున్నారు.ఇందుకోసం రూ.3 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ కమీషన్లతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల వైద్యారోగ్యశాఖతో జరిపిన పలు సమీక్ష సమావేశాల్లో కలెక్టర్ టీకే శ్రీదేవి ఆవేదన వ్యక్తంచేశారు. పడిపోతున్న లింగనిష్పత్తి

 తాజా జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లాలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. 2001లో వెయ్యి మందికి 952మంది ఆడపిల్లలు ఉన్నారు. 2011లో ఆ సంఖ్య 900కి తగ్గింది. ప్రస్తుతం ప్రతి వెయ్యిమందికి 850మంది ఆడపిల్లలు ఉన్నారు. జిల్లాలోని పది మండలాల్లో మహిళల జనాభా గణనీయంగా పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 10 మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి 800లోపే ఉండడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని తలకొండపల్లి, తిమ్మాజిపేట, ఆమనగల్లు, ఖిల్లాఘనపురం, దేవరకద్ర, బాలానగర్, కొత్తూర్, దామరగిద్ద, వెల్దండ, అలంపూర్ మండలాల్లో స్త్రీ, పురుష నిష్పత్తి 1000:800గా నమోదైంది. గత పదేళ్లలో గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య 38శాతానికి తగ్గింది.

 

 ఇవీ ఘటనలు

వారం రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో మురుగు కాల్వలో అప్పుడే పుట్టిన ఆడశిశువు పడేశారు.మహబూబ్‌నగర్ మండలం ధర్మపూర్‌లో ముళ్లపొదల్లో ఆడ శిశువును వదిలేసి వెళ్లారు.  ఎదిర శివారులో చెత్తకుప్పల్లో మూడు రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డను వదిలేశారు. అచ్చంపేట శివారులో దోరికిన ఆడ శిశువును స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

  

 లింగనిర్ధారణ పరీక్షలు నేరం

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాం. స్కానింగ్ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేకనిఘా ఏర్పాటు చేశాం. అనుమానం వచ్చిన ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తనిఖీచేస్తాం. కొంతమంది డాక్టర్లు వారిపేర్ల మీద స్కానింగ్ కేంద్రాలు నడిపిస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచాం. గర్భంలో ఉన్న శిశువు ఎవరు అనే విషయం చెబుతున్న స్కానింగ్ కేంద్రాలు ఉంటే మాకు సమాచారం ఇస్తే కఠినచర్యలు తీసుకుంటాం.   - పార్వతి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top