‘కోట’పై కామ్రేడ్ల కన్ను

Cpi Focused On Mahabubabad - Sakshi

సన్నాహక సమావేశాల ద్వారా సమాయత్తం

సంస్థాగతంగా పట్టు ఉన్న మహబూబాబాద్‌లో తిరిగి పట్టు సాధించేందుకు సీపీఐ, సీపీఎంలు పావులు కదుపుతున్నాయి. అందుకు పార్లమెంట్‌ ఎన్నికలను వేదికగా చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి. తమకు పట్టున్న మానుకోటలో పోటీచేయాలనుకుంటున్నాయి. ఇందుకోసం పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో మానుకోట కేంద్రంలో సీపీఐ సమావేశం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెరడ్డి హాజరై శ్రేణులకు మార్గనిర్ధేశం చేశారు. అలాగే గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని పార్టీశ్రేణులను సన్నద్ధం చేయనున్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల ఉనికి నేడు మానుకోట జిల్లాలో ప్రశ్నార్థకమువుతోంది. ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్లీ పట్టు సాధించేందుకు ఎర్రజెండా పార్టీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో మానుకోట స్థానం నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమితో జట్టుకట్టిన్నప్పుడు రాష్ట్రవాప్త్యంగా పొత్తులో భాగంగా మానుకోట టికెట్‌ను సీపీఐ కోరినప్పటికీ లభించలేదు.

జిల్లాలో ఉన్న మానుకోట, డోర్నకల్‌ స్థానాల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అలాగే సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ తరుపున అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపి ఓటమి చవిచూసింది. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసి పార్లమెంట్‌ ఎన్నికల్లో బరిలో నిలిచి మానుకోట సీటు సాధించి తీరాలన్న సంకల్పంతో ఆపార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు.

ప్రత్యేక వ్యూహంతో ముందుకు
జిల్లాలో సీపీఐ గత వైభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తోంది. 2009లో మహాకూటమిలో పొత్తులో భాగంగా మానుకోట నుంచి సీపీఐ అభ్యర్థిగా కుంజా శ్రీనివాస్‌రావు పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ చేతిలో ఓటమి చెందాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి గెలుపుకోసం సీపీఐ శ్రేణులు కృషిచేశారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పై ఎటువంటి ప్రకటన చేయకపోవటంతో, పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బలం ఉన్న  నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని సూత్రపాయంగా సీపీఐ, సీపీఎంలు యోచిస్తున్నాయి.

జాతీయ రాజకీయాలు, ప్రయో జనాల నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించడానికి కాంగ్రెస్‌ పార్టీతో కేంద్రంలో పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ సీనీయర్‌నేతలు అంటున్నారు. ప్రధానంగా భువనగిరి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌ స్థానాల్లో  చెరో రెండు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు ఆ పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మానుకోట పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల క్యాడర్‌ బలంగా ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాల నిర్వహించి వారిని ఎన్నికలకు సన్నద్ధం చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top