లాక్‌డౌన్‌.. టిక్‌ టాక్‌ల జోరు

Corona: People Spending Much Time On TIK TOK In Lockdown - Sakshi

టిక్‌ టాక్‌.. చిన్నారులకు, యువతను ఆకర్షిస్తున్న యాప్‌. హుషారెత్తించే పాటలు.. సరదా సంభాషణలు.. ఊపు తెప్పించే డ్యాన్సులను అచ్చంగా అలానే అనుకరిస్తూ మరో వీడియోను రూపొందించవచ్చు. లాక్‌డౌన్‌ వేళ ఈ సరదా యాప్‌ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఉపయోగిస్తున్నారు. రకరకాల వీడియోలు రూపొందించి తమ వారికి షేరింగ్‌ చేస్తూ లాక్‌డౌన్‌ కాలాన్ని సరదాగా గడిపేస్తున్నారు.

సాక్షి, షాద్‌నగర్‌ ‌: టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా కొందరు కాలక్షేపానికి వీడియోలు చేస్తుంటే, మరికొందరు తమలోని టాలెంట్‌ను బయటపెట్టేందుకు మంచి వేదికలా భావిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ యాప్‌ అందరికి చేరువైంది. ఇందులో ఖాతా ప్రారంభించి సులభంగా వీడియోలు చేయవచ్చు. ఈ మధ్య కాలంలో చిన్నారులను మొదలుకొని పెద్దవారు కూడా ఈ టిక్‌ టాక్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో రకరకాల ఎడిటింగ్‌ టూల్స్, ఆడియో క్లిప్పులు ఉంటాయి. ఫేమస్‌ డైలాగులు, పంచ్‌ డైలాగులు, పాటలు ఇలా ఎన్నో ఇందులో ఉంటాయి. వీటి సహాయంతో వీడియోలు తయారు చేస్తున్నారు. ఆడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, పాటలను అనుకరిస్తూ మాటలు, సంభాషణలు చేయడం జరుగుతుంది. టిక్‌టాక్‌ యాప్‌ 38 భాషల్లో అందుబాటులో ఉండటంతో ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. టిక్‌టాక్‌ ఖాతాలకు ఫాలోయింగ్‌లు, వీడియో పోస్టులకు లైకులు, కామెంట్‌లు అధికంగా వస్తుండటంతో చాలా మంది యువత ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.  

సరదా.. సరదాగా.. 
లాక్‌డౌన్‌ అమలవుతుండడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా చాలా మంది ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. సరదాగా టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ ఒకరికొకరు షేరింగ్‌లు చేసుకుంటున్నారు. తమకు నచ్చిన విధంగా వీడియోలు తయారు చేస్తూ సరదాగా గడపడమే కాకుండా అందరిలో ఉత్తేజాన్ని నింపే విధంగా టిక్‌ టాక్‌ వీడియోలు తయారు చేయాలని ఛాలెంజ్‌లు విసురుతున్నారు. 

ప్రతిభకు పదును 
టిక్‌ టాక్‌ చేయడం అంటే మాటలు కాదు.. సన్నివేశానికి, పాటలు, డైలాగులకు తగిన విధంగా హావభావాలు, డ్యాన్సులు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే టిక్‌ టాక్‌ వీడియో ఆకర్షిస్తుంది. టిక్‌టాక్‌ వీడియో చాలా తక్కువ విడిది ఉంటుంది. తక్కువ సమయంలో చేసే ఈ వీడియోకు ఎన్నో ఎడిటింగ్‌లు చేసుకోవచ్చు. వీడియో మంచిగా వచ్చేందుకు గంటల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు. తమలో ఉన్న ప్రతిభను ఓ రకంగా టిక్‌టాక్‌ వెలికి తీస్తుందని చెప్పవచ్చు.

సరదాగా టిక్‌టాక్‌ చేస్తుంటా 
టిక్‌టాక్‌ యాప్‌లో వీడియోలు చేయడం అంటే ఎంతో సరదా. స్నేహితులతో కలిసి ఎన్నో వీడియోలు చేశాను. ఆన్‌లైన్‌లో ఎన్నో యాప్‌లు ఉన్నాయి. వాటిని తెలుసుకొని పాటలు, డైలాగులకు సంబంధించిన వీడియోలు తయారు చేస్తుంటాను. 
– రఘు, షాద్‌నగర్‌ 

ప్రతిభను వెలికి తీయవచ్చు 
టిక్‌టాక్‌ ద్వారా మనలోని ప్రతిభను వెలికితీసే అవకాశం ఉంటుంది. పాటలకు డాన్సులు చేయడం, డైలాగులు చెప్పడం వంటివి అందరికిరావు. కానీ, ఇలాంటి యాప్‌ల ద్వారా సమయం దొరికినప్పుడు తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. 
– మధు, షాద్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top