‘గుట్ట’లో కార్డన్‌ సెర్చ్‌

cordon search in yadagiri gutta - Sakshi

డీసీపీ రాంచంద్రారెడ్డి, ట్రైనీ ఐపీఎస్‌ రక్షిత ఆధ్వర్యంలో సోదాలు

బ్రహ్మోత్సవాల రెండో రోజు ఘటనతో సర్వత్రా చర్చ

నిర్బంధ తనిఖీలతో ఉలిక్కిపడిన ప్రజలు

యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరిగుట్ట పట్టణంలోని పలుకాలనీల్లో ఆదివారం వేకువజామున పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. డీసీపీ రాంచంద్రారెడ్డి, ట్రైనీ ఐపీఎస్‌ రక్షిత ఆధ్వర్యంలో ఖాకీలు నిర్బంధ తనిఖీలు నిర్వహించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వేకువ జామున గాఢ నిద్రలో ఉన్న ఆయా కుటుంబాలు.. ఒక్క సారిగా ఇంటి తలుపుల శబ్దం విని తీసే సరికి పోలీసులు కనిపించడంతో ఏమీ జరిగిందోననే ఆందోళన నెలకొంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రెండో రోజే కార్డన్‌ సెర్చ్‌ చేయడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది. పట్టణంలోని ప్రశాంత్‌నగర్, సుభాష్‌నగర్, అంగడిబజారు, పెద్దకందుకూర్‌ ప్రాంతాల్లో సుమారు 300 ఇళ్లు, వ్యభిచార గృహాలపై పోలీసులు ఒక్కసారిగా సోదాలు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. భక్తులు బస చేసే ప్రవేట్‌ లాడ్జీల్లోకి వెళ్లి పలు జంటలను  అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, కుటుంబాల్లో ఉన్న వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.

పత్రాలు సరిగ్గా లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేసిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సోదాల్లో పత్రాలు సరిగ్గా లేని 23 ద్విచక్రవాహనాలు, 4 కార్లు, 4 ఆటోలను ఠాణాకు తరలించారు. అంతే కాకుండా లాడ్జీల్లో ఉన్న 16 జంటలను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురులాడ్జీ యాజమానులను అరెస్టు చేసి 5మంది ఉమెన్స్‌ రెస్క్యూ చేశారు. ఉదయాన్నే మద్యం అమ్మకాలు జరుపుతున్న రెండు బెల్ట్‌ దుకాణాపై దాడులు చేసి సీజ్‌ చేశామని,  అనుమానితుడిని, 8మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. ఈ సోదాల్లో యాదగిరిగుట్ట, భువనగిరి ఏసీపీలు సముద్రాల శ్రీనివాసచార్యులు, జీతేందర్‌రెడ్డి, ఎనిమిదిమంది సీఐలు, 20మంది ఎస్‌ఐలు, 15మంది మహిళా పోలీసులు, 150మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్‌ సెర్చ్‌కు ప్రజలు మద్దతునిచ్చారని, రానున్న రోజుల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం పెద్దదిగా మారుతుండటంతో నిత్యం ఇలాంటి దాడులు చేయాలని ప్రజలు పోలీసులను కోరారు. వాహనాల పత్రాలు సరిగ్గా ఉన్న పలు వాహనాలను యాజమానులు పత్రాలు తీసుకెళ్లి పోలీసులకు అందజేయడంతో పలువురికి ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top