కానిస్టేబుళ్లకు ప్రత్యేక పెంపు అవసరం

Constables need special Wage Hike - Sakshi

     వేతన లోపాలు సవరించండి 

     పీఆర్‌సీ చైర్మన్‌కు టీజీవో విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: వేతన లోపాలు సవరించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల (టీజీవో) సంఘం కోరింది. గత పీఆర్‌సీల్లో చైర్మన్లు అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్ల కొన్ని విభాగాల ఉద్యోగులు ముఖ్యంగా కానిస్టేబుళ్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది. బుధవారం సచివాలయంలో పీఆర్‌సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్, కమిటీ సభ్యుడు రఫత్‌ అలీని టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ కలసి గతంలో జరిగిన పీఆర్‌సీ నష్టాలను వివరించారు.

ముఖ్యంగా కానిస్టేబుళ్లు గత పీఆర్‌సీల్లో వేతన సవరణ లోపాల కారణంగా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఒకప్పుడు సీనియర్‌ అసిస్టెంట్‌ కంటే ఎక్కువ వేతనం కలిగిన కానిస్టేబుళ్లకు గత పీఆర్‌సీ చైర్మన్ల నిర్లక్ష్యం కారణంగా వేతనం దారుణంగా తగ్గిపోయిందని తెలిపారు. ఎక్కువ పని చేసే వారికి అన్యాయం జరిగిందని వివరించారు. వారితోపాటు వేతన వ్యత్యాసాలు ఇతర విభాగాల్లోనూ ఉన్నాయని, వాటిని సవరించి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు సమైక్యాంధ్ర పాలనలో పీఆర్‌సీ అమలులో ఆలస్యం కారణంగా ఉద్యోగులు రెండు పీఆర్‌సీలు కోల్పోయారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి 11వ పీఆర్‌సీలో ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పీఆర్‌సీ రిపోర్టును త్వరగా తయారు చేసి ఆగస్టు మొదటి వారంలోపే సమర్పించాలని కోరారు. సమావేశంలో టీజీవో నేతలు రవీందర్‌రావు, కృష్ణమూర్తి, రాజ్‌కుమార్‌గుప్తా, ఉమాకాంత్, యాదగిరి, ఎంబీ కృష్ణాయాదవ్, జి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top