ఎస్‌ఐ నోటి దురుసుపై ఆందోళన

Congress Leaders Protest In front Of Police station Nizamabad - Sakshi

సాక్షి, భీమ్‌గల్‌: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీధర్‌ రెడ్డి నోటి దురుసుతో కాంగ్రెస్‌ పార్టీ, గిరిజన నాయకులు నిరసనకు దిగారు. వారిపై చేసిన దూషణలకు నిరసనగా శుక్రవారం భీమగల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గిరిజనులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం స్థానిక యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు బదావత్‌ గోపాల్‌ నాయక్‌కు మరో గిరిజనుడితో జరిగిన ఘర్షణ విషయంలో ఎస్‌ఐ శ్రీధర్‌ రెడ్డి తనను, కాంగ్రెస్‌ పార్టీని పరుష పదజాలంతో దూషించాడని మండల పార్టీ నాయకులకు తెలిపాడు.

దీంతో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానాల మోహన్‌ రెడ్డి, భీమ్‌గల్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మూడెడ్ల జితేందర్, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి చంద్రూనాయక్, టీపీసీసీ సెక్రెటరీ ముస్సావీర్‌ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు గిరిజనులతో కలిసి నినాదాలు చేస్తూ పీఎస్‌ ఎదుట నిరసన తెలిపారు.

అనంతరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ప్రధాన రహదారిపై బైటాయించి ఎస్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకుని సీఐ సైదయ్య, ఎస్‌ఐ శ్రీధర్‌ రెడ్డితో పాటు మరి కొందరు ఎస్‌ఐలు, సిబ్బంది తరలివచ్చారు. వీరితో మానాల మోహన్‌ రెడ్డి, చంద్రునాయక్, కన్నె సురేందర్‌లు వాగ్వాదానికి దిగారు. రాజకీయ ఒత్తిళ్లతో తమ నాయకులపై అణిచివేత చర్యలకు దిగడం తగదన్నారు. ఎస్‌ఐకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రెట్టించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అని ఒక వైపు చెబుతూనే ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సబబన్నారు.

ఎస్‌ఐ పరుష పదజాలంతో ఎందుకు దూషించాడని ప్రశ్నించారు. ఒక దశలో గిరిజన మహిళలు ఎస్‌ఐని చుట్టుముట్టారు. సీఐ సైదయ్య ఆందోళనకారులకు ఎంత నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. దీంతో ఎస్‌ఐ శ్రీధర్‌ రెడ్డి ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో వారు శాంతించి ఆందోళనను విరమించారు. నిరసనలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మల్లిక గంగాధర్, రత్నయ్య, కర్నె గంగయ్య, పర్స అనంతరావ్, యూత్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ సెక్రెటరీలు ఆరె రవీంధర్, బొదిరె స్వామి, ఉపాధ్యక్షుడు నాగేంద్ర, మండల కన్వీనర్‌ వాకా మహేష్, కనికరం మధు, సుర్జీల్‌ గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top