ఎన్నికల నిర్వహణకు సిద్ధం

Collector MV Reddy Ready For Elections - Sakshi

 25 వరకు కొత్త ఓటర్ల నమోదు  

నేడు ,రేపు ప్రత్యేక ఓటరు క్యాంపెయిన్‌  

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీరెడ్డి  

ఓటింగ్‌ శాతం పెంచాలి

సాక్షి,మేడ్చల్‌ జిల్లా:  అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా  నిర్వహించేందుకు జిల్లా అధికారయంత్రాంగం  సిద్ధంగా ఉందని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు.పోలింగ్‌ స్టేషన్లు మొదలుకొని ఈవీఎం భద్రత, సిబ్బంది, పోలీసు భద్రత వంటి ఏర్పాట్లన్నీ  చురుకుగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమా వేశం మందిరంలో జరిగిన మీడియా సమావేశం లో కలెక్టర్‌ ఎంవీరెడ్డి మాట్లాడారు. జిల్లాలో 2,110 పోలింగ్‌ స్టేషన్లు.12 వేల మంది సిబ్బంది, 8 వేలమంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఎన్నికల నిర్వహణకు ఐదుగురు ఇఆర్‌ఓలు ,18 మంది ఏఇఆర్‌ఓలు,12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

జిల్లాలో 19.87 లక్షల ఓటర్లు..
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప్ప ల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి   జీహెచ్‌ఎంసీ పరిధిలోకి ఉండగా,  మేడ్చల్‌ నియో జకవర్గం మాత్రం రూరల్‌ పరిధిలో ఉందన్నారు. తెలంగాణలో అత్యధికంగా జిల్లా పరిధిలోని   ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 19,87,270 మంది కాగా,ఇందులో పురుష ఓటర్లు 10,45,502 మంది  మహిళా ఓటర్లు 9,41,462 మంది ఉన్నారని కలెక్టర్‌ వివరించారు.  జిల్లాలో మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా 4,75,506 మంది ఓటర్లు ఉండగా, కూకట్‌పల్లి నియోజకవర్గంలో తక్కువగా 3,11,957 మంది ఉన్నారన్నారు.  కుత్బుల్లాపూర్‌లో 4,33,519 మంది ఓటర్లు, ఉప్పల్లో 4,03,143 మంది, మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,63,145 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.  

జిల్లాకు 3,640 ఈవీఎంలు   
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాకు 3,640 ఈవీఎంలతోపాటు  3,338 బ్యాలెట్‌ యూనిట్లు, 2,630 కంట్రోల్‌ యూనిట్లు, 2,850 వీవీ ప్యాడ్‌లు రానున్నాయన్నారు. వీటినంటిని శామీర్‌పేట వ్యవసాయ మార్కెటింగ్‌  గోదాములో భద్ర పరిచేందుకు  చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ గోదాముల వద్ద గట్టి పోలీసు బందోస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌  తెలిపారు. ఈ సారి కొత్తగా ఓటు వేసిన ప్రతి ఓటరుకు రిషిప్ట్‌(రశీదు)వచ్చేవిధంగా వీవీ ప్యాడ్‌ ప్రింటర్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుందన్నారు. ఈవీఎంలపై ఓటర్లల్లో అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
  జిల్లాలో  2,110 పోలింగ్‌ స్టేషన్ల ఉండగా, ఇందులో ఇందులో మేడ్చల్‌ నియోజకవర్గంలో 570, కుత్బుల్లాపూర్‌లో 431, కూకట్‌పల్లిలో 372, మల్కాజిగిరిలో 379, ఉప్పల్‌ నియోజకవర్గంలో 358  పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు.జిల్లాలో ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు కలెక్టర్‌ ఎంవీరెడ్డి తెలిపారు. ఓటరు నమోదులో భాగంగా కొత్తగా లక్ష నుంచి 1.50 లక్షల కొత్త  ఓటర్లు  రానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం(సెల్‌) అధికారి వెంకటేశ్వర్లు పాల్గోన్నారు.

సైనికుల్లా పనిచేయాలి
కీసరటౌన్‌: ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అధికారులు, సిబ్బంది సైనికుల్లా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నాహాలపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా ఓటర్ల ముసాయిదా సవరణపై వచ్చిన అభ్యంతరాలు, సవరణలపై ఆలస్యం లేకుండా పరిష్కరించాలన్నారు.  

బోగస్‌ ఓటర్ల తొలగింపునకు చర్యలు
కీసరటౌన్‌: జిల్లాలో బోగస్‌ ఓటర్లు, మృతి చెందిన ఓటర్లు, బదిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి  రాష్ట్రఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారికి వివరించారు. శుక్రవారం  ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌లతో రజత్‌కుమార్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్య పర్చి ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీ సమక్షంలో ఈవీఎంలను పరిశీలించాలన్నారు.   జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుకర్‌రెడ్డి, ఆర్డీవోలు లచ్చిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top