జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్‌!

CM KCR Comments Over Janatha Curfew - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన రేపటి( ఆదివారం) జనతా కర్ఫ్యూకు అందరూ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు కోరారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు తిరగవని చెప్పారు. మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోతాయని తెలిపారు. అత్యవసర సేవల కోసం ప్రతీ డిపోలో 5 బస్సులను అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను రాష్ట్రంలోకి అనుమతివ్వమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. షాపులు, మాల్స్‌ స్వచ్ఛందంగా మూసివేయాలన్నారు. వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రులు, పాలు, కూరగాయలు, పండు, పెట్రోల్‌ బంకులు, మీడియా సిబ్బందికి ఇందులోనుండి మినహాయింపు ఉందన్నారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ రెండురోజుల తర్వాత మహారాష్ట్ర బార్డర్‌ను మూసివేసే ఆలోచన చేస్తున్నాం. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. కరోనా వైరస్‌పై ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టాం. 5,274 నిఘా బృందాలు పని చేస్తున్నాయి. అంతరాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 52 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. 78 మంది జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌లు పని చేస్తున్నాయి. మార్చి 1నుంచి ఇప్పటివరకు 20 వేల మందికి పైగా విదేశాల నుంచి వచ్చారు. 11 వేల మందిని ఆధీనంలోకి తీసుకున్నాం. 700 మందికి పైగా కరోనా అనుమానితులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారందరూ విదేశాలనుంచి వచ్చిన వారే. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తక్షణం రిపోర్టు చేయండి. వైద్య పరీక్షలు నిర్వహించి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం. ఇది మీ సామాజిక బాధ్యతగా గుర్తించాల’ని విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top