అనుమతులన్నీ క్లియర్‌!

Clear all the permissions to Kaleshwaram Project! - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ తుది అనుమతులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రాజెక్టుకు తుదిదశ పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టుకు ఇప్పటికే అటవీ, భూగర్భ జల శాఖ, కన్‌స్ట్రక్షన్‌ మెషినరీ డైరెక్టరేట్‌ అనుమతులురాగా.. కీలకమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త అని, ప్రాజెక్టు కీలకమైన మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను ఇక యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ అనుమతులు రావడానికి కృషి చేసిన మంత్రి హరీశ్‌రావును, నీటి పారుదల, అటవీశాఖ అధికారులను సీఎం అభినందించారు. 

సంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ 
ఈ నెల 5న ఢిల్లీలో సమావేశమైన జల సం బంధమైన ప్రాజెక్టుల ‘ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ) కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలంకషంగా చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదని తేల్చింది. ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు, కాలువలు, పంపుహౌజ్‌ల నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అయితే పలు షరతులు విధించింది. ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను సోమ వారం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ సీఈ నరేందర్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎల్‌ అండ్‌ టి, మెగా సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. 

జూన్‌ నుంచే నీటిని తీసుకోవాలి 
నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని చెప్పారు. ‘‘ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు పాత జిల్లాల పరిధిలో సాగు, తాగునీరు అందుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నాం. అటు అధికారులు, ఇటు వర్క్‌ ఏజెన్సీలు, ఇంజనీర్లు శ్రమిస్తున్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వపరంగా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం. అటవీ, పర్యావరణ అనుమతులు రావడానికి అటవీశాఖ అధికారులు శ్రమించారు. అందరికీ ధన్యవాదాలు. పర్యావరణ అనుమతులు వచ్చిన స్ఫూర్తితో ప్రాజెక్టు నిర్మాణ వేగం మరింత పెంచాలి. వాస్తవానికి ఓ భారీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 20 ఏళ్లకుపైగా సమయం తీసుకునే సంప్రదాయం ఉంది. కానీ రాష్ట్రంలో రెండు మూడేళ్లలోనే ప్రాజెక్టులు పూర్తిచేసి.. కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందించాలని సంకల్పించాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది వర్షాకాలం నుంచే పాక్షికంగా నీటిని ఎత్తిపోసి వీలైనంత వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతాం. వచ్చే ఏడాది చివరి నాటికల్లా కాళేశ్వరం ప్రాజె క్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజ్‌లు, కాల్వలు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నా ం. ఇందుకు అనుగుణంగా అధికారులు, ఇంజనీర్లు పనిచేయాలి..’’ అని సూచించారు.

నిధులకు ఇబ్బందేమీ లేదు..
ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించడంతో పాటు వివిధ బ్యాం కుల ద్వారా మరో రూ. 20 వేల కోట్లు సమీకరిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. ‘‘అవసరమైన నిధులు, భూమి, అనుమతులు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల నిర్మాణంలో వేగం పెంచాల్సిన అవసరముంది. మూడు షిఫ్టుల్లో 365 రోజులు పనిచేయాలి. జూన్‌ నుంచి వర్షాలు కురిసి గోదావరికి వరదలు వస్తాయి. ఆలోగా ఏయే పనులు చేయాలి, జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఏమేం చేయాలి, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఏ పనులు చేయాలన్న విషయంలో స్పష్టతకు రావాలి. రోజువారీ షెడ్యూల్‌ ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయాలి..’’అని సూచించారు. తాను నెలకోసారి, మంత్రి హరీశ్‌రావు పది రోజులకోసారి ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు. 

ఈఏసీ పెట్టిన షరతులివీ..
- ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున నిర్మా ణ దశలో, నిర్మించిన తర్వాత ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు సం బంధించిన అంశాలను నివేదించాలి. 
అటవీ శాఖ సమన్వయంతో గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి, రిజర్వాయర్‌ రిమ్‌ ట్రీట్‌మెంట్‌ను చేపట్టాలి. దేశీయ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలి. 
ఘనవ్యర్థాల నిర్వహణ పర్యావరణ హితంగా ఉండాలి. ప్రధానంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను భూమిలో నిక్షిప్తం చేయొద్దు. శాస్త్రీయ విధానంతో రీసైక్లింగ్‌ చేయాలి. 
భూమిని కోల్పోయిన వారికి భూసేకరణ చట్టానికి అనుగుణంగా  పరిహా రం ఇవ్వాలి. 
ఆధునీకరణ పనులు పూర్తయ్యే వరకు చెన్నైలోని కేంద్ర అటవీ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి అర్ధ వార్షిక నివేదికలు సమర్పించాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top