మత్తడి కోసం గ్రామాల మధ్య ఘర్షణ

Clashes Between Two Villages Over Water Issue In Kamareddy  - Sakshi

సముదాయించిన పోలీసులు

రెండు గ్రామాలకు నీటి పంపిణీ

సాక్షి, దోమకొండ (కామారెడ్డి): ఎడ్లకట్ట నీటి విషయంలో సోమవారం ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని గొట్టిముక్కుల గ్రామ శివారులో ఎడ్లకట్ట వాగు మత్తడి నుంచి నీటి కాలువ ద్వారా ప్రవహించే నీటి విషయంలో ఈ ఘర్షణ నెలకొంది. సంఘమేశ్వర్‌ గ్రామానికి చెందిన వంద మంది రైతులు మత్తడికి చేరుకున్నారు. దీంతో గొట్టిముక్కుల గ్రామస్తులు, రైతులు కూడా అక్కడికి చేరుకున్నారు. మత్తడి నుంచి వెళ్లే కాలువ ద్వారా నీరు సంఘమేశ్వర్‌ గ్రామ చేరువులోకి వెళ్లాల్సి ఉందని, కాని గొట్టిముక్కుల గ్రామస్తులు కాలువ నీటిని గొట్టిముక్కుల చెరువులోకి వెళ్లేలా అడ్డుగా ఉన్న కాలువ రాళ్లను తొలగించారని ఆరోపించారు. కాగా తమ చెరువులోకి కూడా నీరు గతంలో నుంచే వెళుతుందని ఇది కొత్తగా తాము చేసింది కాదని గొట్టిముక్కుల గ్రామస్తులు వాదించారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్‌ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. విషయంపై ఉన్నతాధికారులతో పాటు ఇరిగేషన్‌ అధికారులకు వివరించారు. సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారులు అందుబాటులో ఉండరని, మంగళవారం ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని ఇరుగ్రామాల వారికి ఆయన సూచించారు. రెండు గ్రామాలకు చెందిన రైతులను, గ్రామస్తులను, నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అక్కడికి చేరుకుని నీటిని గతంలో రెండు గ్రామాల చెరువులకు వాడటానికి కాలువ తీశారని సంఘమేశ్వర్‌ గ్రామానికి 60 శాతం, గొట్టిముక్కుల గ్రామానికి 40 శాతం నీటిని వాడుకోవాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top