సాంకేతికతలో మనమే ముందుండాలి

Chidambaram Holds Meet With Telangana Cong Leaders On Shakti App - Sakshi

శక్తి యాప్‌ సమీక్షలో కేంద్ర మాజీమంత్రి చిదంబరం

రానున్న ఎన్నికల్లో టెక్నాలజీదే కీలక పాత్ర

ఇందులో ప్రత్యర్థులపై మనం పైచేయి సాధించాలి

ప్రత్యర్థుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఆయుధం ‘శక్తి’: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో ఏటా 7 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదవుతున్నారు. వారంతా యువకులు కావడంతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఎక్కువ ఉంటుంది. అదే పరిజ్ఞానంతో కొత్త ఓటర్లను ఆకర్షించడంలో సఫలం కావాలి. ఈ విషయంలో రాజ కీయ ప్రత్యర్థి కన్నా మనం ముందుండాలి. వారి వేగాన్ని అందుకునేలా శక్తి యాప్‌ లో సభ్యులను చేర్పించాలి’అని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన శక్తి యాప్‌ సమీక్ష సమావేశానికి చిదంబరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 2.2 కోట్ల ఓటర్లు ఉన్నారని, వారిలో కనీసం 10% (22 లక్షలు) మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న లక్ష సభ్యత్వాలు చాలా తక్కువని, ›ప్రతి పోలింగ్‌ బూత్‌ లో 25 మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. ‘కాంగ్రెస్‌ నేతల కాళ్లు ఆఫీసుల్లో, సొంత పనుల్లో కాకుండా క్షేత్రంలో ఉండాలి. యాప్‌ ద్వారా నాయకత్వ స్థాయి నుంచి కింది స్థాయి వరకు సమాచారం వస్తుంది, దీన్ని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆలోగా ప్రతి నెలా 2 లక్షల మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించేలా నేతలు పనిచేయాలి’అని సూచించారు.

అత్యధికంగా అంబర్‌పేటలో..
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు శక్తి యాప్‌ చాలా ఉపయోగపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శక్తి యాప్‌ ప్రాజెక్టును రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీన్ని విజయవంతం చేసేందుకు శ్రద్ధతో పనిచేయాలని కోరారు. పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాప్‌ ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. యాప్‌ రాష్ట్ర ఇన్‌చార్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో తెలంగాణలో లక్ష మందిని యాప్‌ సభ్యులుగా చేర్పించగలిగామన్నారు. అత్యధికంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 13,240 మంది.. కోదాడలో 6,467, హుజూర్‌నగర్‌లో 6,120 మంది యాప్‌లో సభ్యులుగా చేరారని చెప్పా రు.

యాప్‌ నమోదు విషయంలో నేతలు అడిగిన సాంకేతిక సమస్యలకు చిదంబరంతో పాటు ఏఐసీసీ విశ్లేషణ డేటా విభాగం ఇన్‌చార్జి ప్రవీణ్‌ చక్రవర్తి సమాధానాలు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

రాష్ట్ర పరిస్థితులపై రాహుల్‌తో చర్చించా: ఉత్తమ్‌
సమావేశం అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకు శక్తినివ్వాలనే ఆలోచనతో శక్తి యాప్‌కు రాహుల్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకే చిదంబరం వచ్చారని వెల్లడించారు. శనివారం తన ఢిల్లీ పర్యటనపై మీడియా ప్రశ్నించగా, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు.   

పలువురు నేతల గైర్హాజరు
రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులంతా సమావేశానికి హాజరవాలని పీసీసీ నుంచి ఆహ్వానం వెళ్లింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలే హాజరయ్యారు. సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి మాట్లాడాలని గ్రేటర్‌ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ నూతి శ్రీకాంత్‌ను కోరగా వీహెచ్‌ అడ్డుచెప్పినట్లు తెలిసింది. అనంతరం చిదంబరం మాట్లాడుతూ.. యువ నాయకులను తక్కువ అంచనా వేయొద్దని, నేతలందరూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హితవు పలికినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top