నేతల అడ్డా.. చేవెళ్ల గడ్డ

Chevella Constituency MLA Candidates - Sakshi

 ఈ నియోజకవర్గం నేతలు

పలు సెగ్మెంట్ల నుంచి పోటీ

 కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి చెరో ముగ్గురు.. 

చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగరానికి ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రసిద్ధి గాంచింది. ఓటర్లలో చైతన్యంలోనూ, జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులను అందించడంలోనూ విశిష్టమైన గుర్తింపు పొందింది. ఒక నియోజకవర్గం నుంచి ఒక్కరో ఇద్దరో ఎమ్మెల్యేలు ఇతర నియోజకవర్గాలకు ఎన్నికవుతుండడం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కానీ  చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో సబితారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి మంత్రులుగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో  ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా  ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.  అంతేకాకుండా జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, యాదవ్‌రెడ్డిలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి  కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వారే. చేవెళ్ల గడ్డ రాజకీయ నాయకుల అడ్డాగా  ప్రత్యేకత చాటుకుంటోంది.                                                                    

సాక్షి, చెవెళ్ల  : పట్లోళ్ల సబితారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెం దినవారు. ప్రస్తు తం మహేశ్వరం ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. దివంగత మాజీ హోంమంత్రి పి. ఇంద్రారెడ్డి సతీమణి ఈమె. 2000 ఏప్రిల్‌ 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసురాలిగా అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. చేవెళ్ల నియోజకవర్గ చరిత్రలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి మొదటి సారిగా శాసనసభలో అడుగుపెట్టారు.

2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొంది వైఎస్సార్‌ మంత్రి వర్గంలో భూగర్భజలవనరుల శాఖమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో  నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు చేవెళ్ల రిజర్వు అయ్యింది. దీంతో ఈ నియోజకవర్గాన్ని తప్పని పరిస్థితులలో వదిపెట్టాల్సి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ సూచనమేరకు జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంనుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆయన మంత్రివర్గంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో పోటీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు 2018లో కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. 

పట్నం మహేందర్‌రెడ్డి స్వగ్రామం షాబాద్‌ మండలం గొల్లూరుగూడ. మేనమామ దివంగత ఇంద్రారెడ్డి ప్రోత్సాహంతో 1994లో టీడీపీ నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనూహ్య రీతిలో గెలుపొందారు. ఆ తరువాత 1999లో వరుసగా రెండోసారి గెలిచారు. 2004లో ఓటమి చెందారు. తిరిగి 2009లో 2014లో విజయం సాధించారు.   తెలంగా ణ రాష్ట్రంలో  తొలి రవాణశాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాను శాసించే నాయకునిగా ఎదిగారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో మంత్రిగా, జిల్లా రాజకీయల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

వ్యాపారవేత్త అయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామం శంకర్‌పల్లి మండలం మాసానిగూడ గ్రామం. ఈయన సికింద్రాబాద్‌ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత వ్యాపారవేత్తగా మారి బోర్‌వెల్స్‌ పరికరాలు తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించారు. స్నేహితుడిగా ఉన్న అప్పటి ఎమ్మెల్యే పి.ఇంద్రారెడ్డితో విభేదించి రాజకీయాలలో చేరారు. తెలుగుదేశం పార్టీనుంచి చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి 1999లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు.

ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికలలో సబితారెడ్డిపై కూడా ఓటమిపాలయ్యారు. హైదరాబాద్‌ పార్లమెంటుకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సాఆర్‌ సూచనమేరకు మేడ్చల్‌ నియోజకవర్గంనుంచి 2009లో పోటీచేసి మొదటిసారిగా విజయం సాధించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు.  ప్రస్తుతం  కాంగ్రెస్‌ పార్టీ నుంచి  ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

కొరగాని సాయన్న రత్నం మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. 1995లో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఎస్సీలకు రిజ ర్వు కావడంతో టీడీపీలోకి వచ్చారు. ఇంద్రారెడ్డి అనుచరుడిగా ఉండడంతో శంషాబాద్‌ జెడ్పీటీసీగా పోటీచేయించి జిల్లా పరిషత్‌ పదవిని కట్టబెట్టారు. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 

చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం చించల్‌పేట గ్రామానికి చెందిన వ్యక్తి  కాలె యాదయ్య. స్థానిక సంస్థల్లో ఎంపీపీ. జెడ్పీటీసీ స్థాయినుంచి  వచ్చిన ఆయన  చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో  2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.  2014లో  మళ్లీ  కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి రత్నంపై గెలుపొంది   టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

పట్నం మహేందర్‌రెడ్డి స్వయాన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి. ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కొండగల్‌ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. 2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు.

టీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి అవకాశం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా కలిసిన కొండగల్‌లో కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు.  ఈ విధంగా ఆరుగురు  ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉమ్మడి  జిల్లాలోని  ఆరు  నియోజకవర్గాలలో  శాసనసభ్యులుగా  పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ అశించినా టికెట్‌ రాక రెబల్‌గా పోటీ చేస్తున్న  పీ. కార్తీక్‌రెడ్డి కూడా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తియే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top