చంద్రముఖి వచ్చింది

Chandramukhi Find in Banjarahills Police Station Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ ఠాణాలో బుధవారం రాత్రి ప్రత్యక్షం

ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ఆమె నోరు విప్పితేగానీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం

రెండురోజులుగా హైడ్రామా ఆందోళనకు దిగిన హిజ్రాలు

సాక్షి, సిటీబ్యూరో/ బంజారాహిల్స్‌ : గోషామహల్‌ నుంచి బరిలోకి దిగిన బీఎల్‌ఎఫ్‌  అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్‌ రాజేశ్‌ అలియాస్‌ చంద్ర ముఖి బుధవారం రాత్రి 11:30 నిమిషాలకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాగుతున్న  అదృశ్యం కేసు కొలిక్కి వచ్చింది.  చంద్రముఖికి లభిస్తున్న ఆదరణ, ప్రజల మద్ధతు, జాతీయ స్థాయిలో మీడియా నుంచి లభిస్తున్న ప్రచారం ప్రత్యర్థులకు కంటగింపుగా మారిందని, ఈ క్రమంలో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకే కిడ్నాప్‌కు పాల్పడి ఉండవచ్చునని బీఎల్‌ఎఫ్‌కు సారథ్యం వహిస్తున్న తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మరోవైపు గురువారం ఉదయం 10.15 గంటల వరకు చంద్రముఖిని హాజరుపర్చాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.  

పోలీసుల ముమ్మర గాలింపు
చంద్రముఖి అనుమానాస్పద అదృశ్యంపై బంజారాహిల్స్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు గాలింపును ముమ్మరం చేశారు. చంద్రముఖి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తును చేపట్టారు. మరోవైపు అన్ని పోలీస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

అనంతపురం వెళ్లిన దర్యాప్తు బృందం..
అనంతపురానికి చెందిన వెంకట్‌యాదవ్‌ అనే వ్యక్తి నుంచి చంద్రముఖికి ప్రాణహాని ఉన్నట్లు సహచర ట్రాన్స్‌జెండర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతపురం వెళ్లారు. ఆమెతో సన్నిహితంగా ఉండే  హిజ్రాలను సైతంపోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మంగళవారం ఉదయం 7.05 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా మెట్లు దిగి కొద్దిదూరం వరకు తాను ఉన్న వీధిలోకి వెళ్లినట్లు కనిపించింది. తిరిగి 8 గంటల ప్రాంతంలో మరోసారి ఆమె రెడీ అయి ఇంట్లోంచి బయటికి ఒంటరిగానే వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండటం వల్ల కేసు పురోగతికి కొంత ఆటంకంగా మారినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.  

ఆందోళనలో ట్రాన్స్‌జెండర్లు..
చంద్రముఖి అదృశ్యం నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లలో అభద్రతాభావం నెలకొంది. బుధవారం ఉదయమే పలువురు ట్రాన్స్‌జెండర్లు  ముషీరాబాద్‌ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని బీఎల్‌ఎఫ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ  సందర్భంగా  ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో చంద్రముఖి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గోషామహల్‌లో ఆమెకు లభిస్తున్న ఆదరణ, జాతీయ స్థాయిలో  మీడియా విస్తృత ప్రచారం చూసి ఓర్వలేకనే పోటీ నుంచి తప్పించేందుకు కిడ్నాప్‌నకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రముఖిని బలవంతంగా పోటీలోకి దిగిందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం, చట్ట సభల్లో తమ గొంతు వినిపించాలనే లక్ష్యంతోనే స్వచ్ఛందంగా పోటీకి దిగిందని సామాజిక కార్యకర్త సజయ తెలిపారు.

విచారణ ప్రారంభించిన కోర్టు
ఆమె తల్లి హైకోర్టులో దాఖలు చేసిన హేబియస్‌ కార్పస్‌  పిటీషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. జస్టిస్‌ చౌహాన్, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఈ కేసును విచారించారు. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు అదృశ్యం కావడమేంటంటూ వారు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. గురువారం ఉదయం చంద్రముఖిని తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top