వరంగల్‌లో మెంటల్‌ ఆస్పత్రి

Central Government ok for Mental Hospital In Warangal district - Sakshi

ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం

75 పడకల సామర్థ్యంతో దవాఖాన నిర్మాణం

రూ. 33 కోట్లు మంజూరు

నగరంలో విస్తరిస్తున్న వైద్యసేవలు

సాక్షి ప్రతినిధి,వరంగల్‌: వరంగల్‌లో త్వరలో మానసిక రోగుల ఆస్పత్రిని నెలకొల్పబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ దవాఖానా ఏర్పాటు కాబోతుంది. రూ. 33 కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రి ఉంది. ఇది మినహా ప్రభుత్వ రంగంలో మరో ఆస్పత్రి ఎక్కడా లేదు. మానసిక రోగాలు తలెత్తితే హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవంగా సాధారణ పేషెంట్ల కంటే మానసిక రోగులకు రోజుల తరబడి చికిత్స అందించాల్సి ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణ రోగులకు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందడం వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారంగా మారింది. అయితే ఈ ఇబ్బం దులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో మానసిక రోగుల ఆస్పత్రిని వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రి సేవలు అందించనుంది.

ప్రతిపాదనలకు ఆమోదం..
కాకతీయ మెడికల్‌ కాలేజీ పరిధిలో మానసిక రోగుల ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం కింద ఈ పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. రూ. 33 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో దవాఖానాను మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపారు. వీటికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్‌మాథూర్‌ తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా కేఎంసీ యాజమా న్యాన్ని ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం మెంటల్‌ ఆస్ప త్రికి సంబంధించిన నిర్మాణం ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి భవనంలో వివిధ విభాగాలైన ఇన్‌ పేషెంట్, అవుట్‌ పేషెంట్, ఫొరెన్సిక్‌ సైన్స్, అడాలసెంట్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, క్రిమినల్‌ సైకాలజీ, సైకియాట్రిక్‌ సోషల్‌వర్క్, కౌన్సిలింగ్‌ తదితర సేవలు ఎక్కడెక్కడ నెలకొల్పుతారనే అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుంది.

వీటిని డిసెంబర్‌ మొదటి వారంలో ఢిల్లీలో జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలోపు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు అందివ్వాల్సి ఉంది. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అను మతులు జారీచేసి సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆస్పత్రి భవన నిర్మాణాలు ప్రారంభిస్తారు. సాధ్యమైనంత వరకు  తుది అనుమతులు వచ్చిన తర్వాత ఆరు నుంచి ఏడాదిలోపు భవన నిర్మాణాన్ని పూర్తిచేసి వైద్య సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. కాగా, మెంటల్‌ ఆస్పత్రికి కేటాయించిన రూ. 33 కోట్లలో రూ. 19.8 కోట్ల నిధులు కేవలం భవనానికి కేటాయించనున్నారు. మిగిలిన నిధులతో ఆస్పత్రికి అవసరమైన సామగ్రిని సమకూర్చుతారు. కాగా, ఈ ఆస్పత్రి నిర్మాణానికి కనీసం మూడు ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో స్థల లభ్యత లేదు. దీంతో కేఎంసీ ప్రాంగణంలో నిర్మించాలా లేదా ఇతర ప్రాంతాల్లో నిర్మించాలా అనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఒక్కొక్కటిగా..
1970వ దశకంలో కాకతీయ మెడికల్‌ కాలేజీ ఏర్పాటైంది. ఈ ఆస్పత్రికి అనుబంధంగా ఎంజీఎంతో పాటు హన్మకొండ, వరంగల్‌లో ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రాంతీయ కంటి దవాఖానా, ఛాతి ఆస్పత్రులు వరంగల్‌కు మంజూరయ్యాయి. అనంతరం వైద్యసేవల పరంగా ఆశించిన పురోగతి లేదు. గత నాలుగేళ్లలో మళ్లీ వైద్య సేవల పరంగా వేగం పెరిగింది. ఎంజీఎం ఆస్పత్రిలో మాతాశిశు విభాగం ఇప్పటికే ప్రారంభమై సేవలు అందిస్తోంది. రూ. 150 కోట్లతో 250 పడకల సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ మరికొన్ని నెలల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా మానసికరోగుల ఆస్పత్రి మంజూరు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top