రాజకీయకోణంలోనే కేంద్ర బడ్జెట్‌

Central budget from a political angle - Sakshi

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని, ప్రధాని మోదీ తెలంగాణ పట్ల అనుసరిస్తు న్న కక్షపూరిత వైఖరికి కేంద్ర బడ్జెట్‌ అద్దం పడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపించారు. శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలనే ధృక్పథం బడ్జెట్‌లో లోపించిందని, బడ్జెట్‌ ప్రతిపాదనల్లో సమాఖ్య స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో 4 లోక్‌సభ స్థానాలను గెలుచు కున్న బీజేపీ..బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి చేసిం ది శూన్యమన్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ తరఫున అమిత్‌షా ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. 

నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా.. 
మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా బడ్జెట్‌లో నయాపైసా కేటాయించలేదని కర్నె మండిపడ్డారు. అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడంపై అమిత్‌షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీ పక్షాన గెలిచిన ఎంపీలు.. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడాలన్నారు. బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రస్తావనే ఏదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ అడగలేదంటూ బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని.. గతంలో ప్రధాని మోదీని కలిసిన ప్రతీ సందర్భంలో సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ అంశంపై వినతి పత్రాలు సమర్పించారన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top