అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..

Candidate Different Cadre Same In Armoor - Sakshi

ప్రచారాలకు తరలి వస్తున్న మహిళా సంఘాల సభ్యులు

 అన్ని పార్టీల ప్రచారాల్లో వారే..

 ఓటరు నాడి తెలియక తలలు పట్టుకుంటున్న నాయకులు 

సాక్షి,ఆర్మూర్‌: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్‌ సైకిల్‌ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్‌ సైకిల్‌కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్‌ను సృష్టించాలని వివిధ పార్టీల అసెంబ్లీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్‌ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది.

అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top