సిటీజన్స్‌.. బీ అలర్ట్‌..

cancer with ready made food - Sakshi

ప్రాసెస్డ్‌ ఫుడ్‌తో క్యాన్సర్‌ ముప్పు..!

మెట్రో నగరాల్లో పెరిగిన అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగం

పిజ్జా, చాకొబార్స్‌ వంటివి శృతి మించితే ప్రమాదమే..  

తాజా పండ్లు, కూరగాయలే మేలంటున్న వైద్యులు

సాక్షి, సిటీబ్యూరో: రెడీమేడ్‌ ఫుడ్‌ అంటే మక్కువ చూపుతున్నారా.. పిజ్జా, బర్గర్, షుగర్‌ డ్రింక్స్‌.. చికెన్‌ నగ్గెట్స్‌.. చాకొబార్స్‌ వంటివి ఇష్టంగా లాగించేస్తున్నారా.. అయితే కొద్ది పరిమాణంలో ఓకేగాని.. 50 శాతం మించితే క్యాన్సర్‌ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఇటీవల దేశంలో కాస్మో పాలిటన్‌ కల్చర్‌కు కేంద్ర బిందువుగా మారిన పలు మెట్రో నగరాల్లో అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌(వివిధ రీతుల్లో శుద్ధి చేసి నిల్వ ఉండేందుకు సంరక్షకాలను కలిపిన పదార్థాలు) వినియోగం 10 శాతం మేర పెరిగినట్లు ‘కాల్‌ హెల్త్‌’ సంస్థ అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఆహార పదార్థాల వినియోగం అనూహ్యంగా పెరగ్గా.. దానితో పాటు 12 శాతం క్యాన్సర్‌ రిస్క్‌ పెరుగినట్టు ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగం దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కత్తా నగరాల్లో అధికంగా ఉన్నట్లు అధ్యయన నివేదిక వెల్లడించడం గమనార్హం.

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ జాబితాలోఉన్న కొన్ని పదార్థాలు..  
తినడానికి సిద్ధంగా.. ఫ్రిజ్‌లో నిల్వచేసిన ఆహారం (ఫ్రోజెన్‌ రెడీ టు ఈట్‌ మీల్స్‌)
చికెన్‌ నగ్గెట్స్, పిజ్జా, అధిక మొత్తంలో నిల్వచేసి ప్రాసెస్‌ చేసిన బ్రెడ్, కేకులు
చక్కెరతో తయారు చేసిన డ్రింక్స్, రెండు నిమిషాల్లో రెడీ చేసుకునే నూడుల్స్, సూప్స్‌
చక్కెర కలిపిన తృణ పప్పు ధాన్యాలు (షుగర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ సిరిల్స్‌)
చక్కెర మోతాదు అధికంగా ఉండే స్నాక్స్, చిప్స్‌
చాకొబార్స్, స్వీట్స్‌   తగ్గించకుంటే క్యాన్సర్‌ ముప్పు

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తయారీలో ముడి పదార్థాలను వివిధ రీతుల్లో అత్యధికంగా వేడిచేసి శుద్ధి చేస్తారు. ఇవి ఎక్కు కాలం నిల్వ ఉండేలా చక్కెర, ఇతర సంరక్షాలు, ఫ్లేవర్స్, రంగులను అధిక మోతాదులో కలుపుతారు. అంతేగాక వీటిలో ఎక్కువగా వినియోగించే సోడియం నైట్రేట్, టిటానియం ఆక్సైడ్‌తో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్‌లైన్‌లోనే ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బర్గర్స్, చికెన్‌ నగ్గెట్స్, చాకొబార్స్‌ వంటి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వెరైటీలే అధికమని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ తాజా సర్వేలోనూ తేలింది. సో సిటీజన్స్‌ బీ అలర్ట్‌.

తాజా పదార్థాలైతే బెటర్‌..
అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కంటే ఇళ్లలో తయారు చేసుకునే బ్రెడ్, బిస్కట్‌లు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రిఫ్రజిరేటర్లలో అధిక కాలం నిల్వ చేసిన పదార్థాల కంటే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయాలను తీసుకుంటే క్యాన్సర్‌ మప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటునన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top