కాలువలు మరిచారా?

Canals Works Pending In Adilabad - Sakshi

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): రైతుల మెట్ట భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో మండలంలోని ముత్నూర్‌ శంకగర్‌గూడ గ్రామపంచాయతీల పరిధిలో 2005లో త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కాని ఎడమ, కుడి కాలువలు నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో రైతులకు సాగునీరు అందక వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. 15 ఏళ్లుగా రైతులు ఆశతో సాగునీటి కోసం ఎదురుచూస్తేనే ఉన్నారు.

రూ.3.70కోట్లతో చెరువు నిర్మాణం
మండలంలోని ముత్నూర్, శంకర్‌గూడ, కేస్లాపూర్,  మెండపల్లి, మెండపల్లిగూడ, దుర్వగూడ, గౌరపూర్, చిత్తబట్ట,« ధర్మసాగర్, మల్లాపూర్‌ తదితర గ్రామాల పరిధిలోని సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2005లో నీటిపారుదలశాఖ రూ.3.70కోట్లతో ముత్నూర్, శంకర్‌గూడ గ్రామాల మధ్య సుమారు 150ఎకరాల విస్తీర్ణంలో త్రివేణి సంఘం చెరువు నిర్మాణం చేపట్టారు. 14 సంవత్సరాలు పూర్తి కావస్తున్న చెరువు కుడి, ఎడమ కాలువలు మాత్రం నిర్మించలేదు. దీంతో చెరువు కేవలం చేపలు పెంచడానికి మాత్రమే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కాలువలను నిర్మించాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

కాలువల నిర్మాణానికి రూ.2కోట్లు 
మండలంలోని ముత్నూర్‌ గ్రామ సమీపంలో నిర్మించినా త్రివేణి సంఘం చెరువు కుడి, ఎడమ కాలువు నిర్మించడానికి మూడు సంవత్సరాల క్రితం నీటిపారుదల శాఖ సర్వే చేసింది. ఎడమ, కుడి కాలువలు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరై మూడేళ్లవుతున్నా స్థానిక నీటిపారుదల, రెవెన్యూశాఖల అధికారుల నిర్లక్ష్యంతో కాలువల నిర్మాణ పనులు కదలడం లేదు. చెరువు కింద భూములు పోతున్న రైతులు తమకు పరిహారం గిట్టుబాటుకాదని భూములు ఇవ్వడం లేదు. ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించకపోవడంతో కాలువల నిర్మాణం ముందుకు సాగడం లేదు.  
చెరువుకు కాలువలు నిర్మిస్తే తమ భూములకు సాగునీరు వస్తోందని ఆశతో ఉన్న ఆ ప్రాంత రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి కాలువలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

సర్వే చేసినా ఫలితం లేదు..
ముత్నూర్‌ త్రివేణి సంఘం చెరువు నిర్మించారు. కానీ కాలువల నిర్మాణం మర్చిపోయారు. మూడు సంవత్సరాలుగా అధికారులు సర్వే చేస్తున్నా కాలువలు మాత్రం నిర్మించడం లేదు. దీంతో మా వ్యవసాయ భూములకు సాగునీరు అందడం లేదు. చెరువుల్లో ఈ ప్రాంత రైతుల వ్యవసాయ భూములకు సరిపడా సాగునీరు ఉన్నా ఫలితం లేదు. దీంతో కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. – తొడసం సంపత్‌రావు, రైతు ముత్నూర్‌ 

అసంపూర్తిగా ఎడమ కాలువు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top