కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్‌హాల్‌లో తీవ్ర విషాదం! | Bride Groom Committed Suicide in Function Hall | Sakshi
Sakshi News home page

కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్‌హాల్‌లో తీవ్ర విషాదం!

Nov 10 2019 1:53 PM | Updated on Nov 10 2019 2:36 PM

Bride Groom Committed Suicide in Function Hall - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరికాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రపరివారం రాక మొదలైంది. పచ్చటి పందిరి, మేళతాళాలతో ఫంక్షన్‌హాల్‌ కూడా ముస్తాబైంది. కాసేపట్లో నూతన వధూవరులు పెళ్లిపీఠాలు ఎక్కాల్సి ఉంది. మూడుముళ్లు, ఏడు అడుగులతో దంపతులై కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. కానీ, ఇంతలో ఏమైంది తెలియదు. పచ్చగా కళకళలాడుతున్న పెళ్లి ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. చక్కగా ముస్తాబై పెళ్లిపీఠాలు ఎక్కాల్సిన వరుడు ఉరిపోసుకున్నాడు. వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అతడు అంతలో తనువు అర్ధంతరంగా చాలించాడు. ఈ ఘోర విషాద ఘటన షేక్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌ హాల్‌లో పెళ్లి వేడుక నిండుగా జరుగుతుండగానే వరుడు సందీప్‌ అనూహ్యంగా ఉరేసుకొని చనిపోయాడు.

ఉదయం పది గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా.. ఉదయమే వరుడి కుటుంబసభ్యులు, బంధువులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. ఫంక్షన్‌ హాల్‌లోని గదిలో వరుడికి మేకప్ చేస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఒంటరిగా గదిలోపలి నుంచి సందీప్‌ గడియపెట్టుకున్నాడు. ఎంతకూ వరుడు బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు బద్దలుకొట్టి తెరవడంతో సందీప్‌ అప్పటికే ఉరికి వేసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పెళ్లిని రద్దు చేశారు. ఈ ఘటనతో ఫంక్షన్‌హాల్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. వధూవరుల కుటుంబాలు దిగ్భ్రాంతి చెందాయి. వరుడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస చారి, పద్మ దంపతుల కుమారుడైన సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని ఆత్మహత్యకు కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement