సాఫ్ట్‌వేర్‌ ప్రియుడి కోసం రూ.1.50లక్షల..

Boyfriend Cheating Girl protest In Front Of House - Sakshi

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

చిన్నచింతకుంట (దేవరకద్ర): ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు సహజీవనం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన సంఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మద్దూర్‌ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన మక్క మోహన్‌కుమార్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ఇలా ప్రేమించుకుంటున్న  సమయంలోనే  నర్మద, మోహన్‌కుమార్‌ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. నర్మద  చిక్కడపల్లి ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌కాలేజీలో 2010 నుంచి 2014 సంవత్సరం వరకు విద్యనభ్యసిస్తూనే ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలాగే, మోహన్‌కుమార్‌ ఓ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించి కాగ్నిజెంట్‌ డీఎల్‌ఎఫ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రియుడి చదువు కోసం రూ.1.50లక్షల ఖర్చు 
ఈ క్రమంలోనే మోహన్‌ పైచదువు కోసం నర్మద రూ.1,50,000 వరకు సాయం అందించింది. 2014సంవత్సరంలో నర్మద కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసిన మోహన్‌ మేమిద్దరం పెళ్లిచేసుకుంటామని, వేరే సంబంధాలు చూడవద్దని చెప్పడంతో నర్మద కుటుంబీకులు కూడా ఆమె సంబంధాల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014 నుంచి 2019వరకు దాదాపుగా 5ఏళ్లుగా వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. ఇదే తరుణంలో నన్ను పెళ్లిచేసుకోమని మోహన్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా మా చెల్లెలి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. అనంతరం మోహన్‌కుమార్‌ చెల్లెలి పెళ్లి కూడా పూర్తయింది.  

తల్లి ఒప్పుకోవట్లేదని పెళ్లికి నిరాకరణ.. 
ఇదిలాఉండగా, గత 6నెలల క్రితం ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో మోహన్‌కుమార్‌ నర్మదతో పెళ్లికి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి పెళ్లి చేసుకుందామని నర్మద, మోహన్‌కుమార్‌ను పట్టుపడుతూ వచ్చింది. ఇటీవల నిన్ను పెళ్లిచేసుకుంటే మా అమ్మ చనిపోతానని అంటుందని, అందుకే నీతో పెళ్లికి నిరాకరిస్తున్నానని మోహన్‌ తేల్చిచెప్పాడు.

దీంతో తాను మోసపోయానని గ్రహించి కొన్నిరోజుల కిందట ఎస్పీని కలిసే ప్రయత్నం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించడంతో నర్మద గత మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కూడా జాప్యం జరగడంతో గత్యంతరం లేక ప్రియుడు మోహన్‌కుమార్‌ ఇంటి ఎదుట గత మూడురోజులుగా ధర్నాకి కూర్చుంది.

పెళ్లంటూ జరిగితే మోహన్‌తోనే జరగాలని, లేదంటే న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని నర్మద తెలిపారు. చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top