రెండు రాష్ట్రాల్లో మండలి ఎన్నికల కోడ్

రెండు రాష్ట్రాల్లో మండలి ఎన్నికల కోడ్ - Sakshi

  • ఫొటో గుర్తింపుకార్డు ఉంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు అనుమతి

  • పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు

  • ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్

  • సాక్షి, మహబూబ్‌నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రా ల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.  



    ముఖ్యమంత్రులు, మంత్రులు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టకూడదని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చే పథకాలను కూడా నిలుపుదల చేయాల్సి ఉంటుందన్నారు. బుగ్గకార్లు కూడా వాడడానికి వీల్లేదని చెప్పారు. గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఫిబ్రవరి 19వ తేదీలోపు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచిం చా రు. నామినేషన్లు స్వీకరించే తేదీ(ఫిబ్రవరి 26న) వెలువరించే ఓటరు లిస్టులో పేర్లు నమోదు చేస్తామని తెలిపారు.



    ఈసారి ఎన్నికల్లో ఓటర్లకు  ఫొటో గుర్తింపుకార్డు తప్పనిసరని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పేరు నమోదు చేసుకోవాలని, పనిచేసే చోటును పరిగణనలోకి తీసుకోబోమన్నారు.  . పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపలతో పాటు బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.



    చిత్తూరు జిల్లాలోని తిరుపతి శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికకు నేటితో ప్రచార గడువు ముగిసిందని తెలిపారు. తిరుపతి ఎన్నికలకు సంబంధించి 256 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలామంది ఇప్పటి వరకు ఖర్చు వివరాలు ఇవ్వలేదని.. వారికి త్వరలో నోటీసులు ఇస్తున్నామన్నారు. వారు స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top