విజృంభిస్తున్న విషజ్వరాలు

విజృంభిస్తున్న విషజ్వరాలు


కాటారం:

 మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున జ్వరంతో మంచంపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు చింతకాని, ప్రతాపగిరి గ్రామస్తులు జ్వరాలతో బాధపడగా.. ప్రస్తుతం చింతకాని పంచాయతీ పరిధిలోని ఇబ్రహీంపల్లి, జాదారవుపేట, ధర్మాసాగర్ గ్రామస్తులు గజగజ వణుకుతున్నారు. ప్రతాపగిరిలో తగ్గుముఖం పట్టిన మళ్లీ విజృంభిస్తున్నాయి. ఒడిపిలవంచలో ముందస్తుగా వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించినప్పటికీ జ్వరాలు తగ్గడం లేదు. ఐదు రోజులుగా ఆయా గ్రామాల్లో దాదాపు 100 మంది వరకు జ్వరాలతో బాధపడుతూ మంచం పట్టారు. కొందరు స్థానికంగా చికిత్స పొందుతుండగా.. మరికొందరు మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. సిద్దం పిన్నయ్య, లక్ష్మి, రజిత, రాజయ్య, రాజు, మహేశ్, పోశం తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు.  



 పారిశుధ్యలోపమే ప్రధానం..

 వాతావరణంలో మార్పుతోపాటు ముదిరిన ఎండలతోనే జ్వరాలు విజృంభిస్తున్నట్లు తెలిసింది. ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుండడంతో జ్వరాలు తగ్గడం లేదు. అంతేకాకుండా పలు గ్రామాల్లోని కాలనీల్లో పారిశుధ్యం లోపించింది. మురగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయి. కలుషిత నీరు, చేతిపంపుల నీరునే తాగుతున్నారు.  



 ఇబ్రహీంపల్లిలో చికున్‌గున్యా లక్షణాలు

 మండలంలోని ఇబ్రహీంపల్లిలో జ్వరపీడితుల్లో ఎక్కువగా చికున్‌గున్యా లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వర బాధితుల్లో ఎక్కువ మంది కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మిగతా గ్రామాల్లో జ్వరపీడితుల్లో రక్తకణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతోపాటు మలేరియా జ్వరాల లక్షణాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిపిలవంచలో ఇటీవల పొన్న సుప్రియ అనే యువతి మలేరియాతో హైదరాబాద్‌లో  చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

 స్పందించని వైద్యసిబ్బంది

 మండలంలో జ్వరాలు విజృంభిస్తున్న వైద్యసిబ్బంది మాత్రం స్పందించడం లేదు. గ్రామాల్లోకి వెళ్లి వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  పంచాయతీ పాలకవర్గాలు పట్టించుకుని పారిశుధ్య పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు.





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top