బీజేపీ మిషన్ తెలంగాణ @ 2019! | BJP mission telangana @ 2019 | Sakshi
Sakshi News home page

బీజేపీ మిషన్ తెలంగాణ @ 2019!

Jan 8 2015 3:48 AM | Updated on Mar 29 2019 9:07 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి - Sakshi

శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

మిషన్ తెలంగాణ-2019’ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కీలక సమావేశాలు హైదరాబాద్‌లో గురువారం జరగనున్నాయి.

* నేడు బీజేపీ కీలక సమావేశాలు
* పనితీరే ప్రామాణికంగా నిర్ణయాలు
* హైదరాబాద్ చేరుకున్న  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా  

 
సాక్షి, హైదరాబాద్: ‘మిషన్ తెలంగాణ-2019’ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కీలక సమావేశాలు హైదరాబాద్‌లో గురువారం జరగనున్నాయి. సభ్యత్వం, విస్తరణ లక్ష్యంగా జరిగే సమీక్షా సమావేశాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహిస్తున్నారు. గతేడాది ఆగస్ట్ పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీకి చేసిన దిశానిర్దేశం, అప్పటి నుంచి ఇప్పటిదాకా పురోగతి, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహం పై సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి అమిత్ షా బుధవారం రాత్రికే హైదరాబాద్ చేరుకున్నారు.  
 
తెలంగాణలో విస్తరణకు సానుకూలం
 తెలంగాణలో పార్టీ విస్తరణకు సానుకూల పరిస్థితులు ఉన్నట్లు బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాకు వచ్చింది.  పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలాన్ని పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్రమే అనుకూలంగా ఉన్నట్టుగా సర్వేల్లో తేలింది. దీంతో ముందుగా రాష్ట్ర పార్టీ సీనియర్లలో ఉన్న అంతరాలను, కొత్తవారిని పార్టీలో ఎదగకుండా అడ్డుగా ఉన్న సీనియారిటీ సమస్య, గ్రామ స్థాయి నిర్మాణంలో వైఫల్యం వంటి వాటిపై మరోసారి సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేయనున్నారు.
 
 తెలంగాణలో ఇప్పుడు పార్టీకి 4లక్షల సభ్యత్వం ఉందని, ఆ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకోవాలని పార్టీకి అమిత్ షా నిర్ధేశించగా డిసెంబర్ 24 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కూడా మైనారిటీలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడానికి ప్రయత్నాలు చేస్తోందని, దానికి దీటుగా ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకునే దిశలో పార్టీ శ్రేణులను అమిత్‌షా సమాయత్తం చేయనున్నారు.
 
 హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌షా
 అమిత్‌షా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీనియర్ నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, కె.లక్ష్మణ్, నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్, ఎన్‌వీఎస్ ప్రభాకర్, పార్టీ నేతలు సంకినేని వెంకటేశ్వర్‌రావు తదితరులు స్వాగతం పలికారు. గురువారం ఉదయం 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా భేటీ కానున్నారు. 11 గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడి తర్వాత రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల దాకా ఈ సమావేశం జరుగుతుంది. రాత్రికి అమిత్ షా ఏపీకి వెళ్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement