
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు విడివిడిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ బార్ కౌన్సిల్ ప్రతిపాదనను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో రెండు బార్ కౌన్సిళ్లకు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 17 నుంచి 26 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు.
నామినేషన్ల పరిశీలన తర్వాత 29న తుది జాబితా విడుదల చేస్తారు. జూన్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి హైకోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ భవనంలో తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో విడివిడిగా పోలింగ్ జరగనుంది. ఒక్కో బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యుల చొప్పున ఎన్నుకుంటారు. ఎన్నికైన సభ్యులు బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.