బాల్కొండ ఓటరు తీర్పు విభిన్నం

Balkonda Voters  Are Different  In Nizamabad - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అవకాశం

శాసనసభ ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు మద్దతు

రాజకీయ విశ్లేషకులకు అంతు పట్టని ఫలితాలు

సాక్షి,మోర్తాడ్‌(బాల్కొండ): బాల్కొండ ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు తలకిందులు చేస్తూ ఇక్కడి ఫలితాలు రావడం ఆనవాయితీగా వస్తోంది. శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోలా విభిన్నమైన తీర్పునిచ్చిన బాల్కొండ ఓటర్లు రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు. శాసనసభ ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ఓటర్లు.. స్థానిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చి టీడీపీకి జైకొట్టారు. ఇలా ఒక్కో ఎన్నికలో ఒక్కో విధమైన తీర్పును వెల్లడించిన బాల్కొండ ఓటర్లు.. రాజకీయ విశ్లేషకులకు తమ నాడిని అంతు పట్టకుండా చేశారు.

 కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ.. 

నియోజకవర్గ పునర్విభజన జరుగక ముందు బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఆర్మూర్, నందిపేట్‌ మండలాలు ఉండేవి. మండల పరిషత్‌లకు తొలిసారి 1987లో ఎన్నికలు జరుగగా, బాల్కొండలో గడ్డం నర్సయ్య, కమ్మర్‌పల్లిలో భాస్కర్‌రావు(కాంగ్రెస్‌), మోర్తాడ్‌లో అమృతలతారెడ్డి, ఆర్మూర్‌లో జగదీశ్వర్‌రెడ్డి, నందిపేట్‌లో మారంపల్లి నర్సారెడ్డి(టీడీపీ) ఎంపికయ్యారు. 1995లో ఎంపీపీ స్థానాలకు పరోక్ష పద్ధతిలో, అలాగే, కొత్తగా జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారు. ఆ సమయంలో బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి పట్టు ఉంది. కానీ, స్థానిక ఎన్నికల్లో ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి రెండు మండలాల్లో ప్రభావం కనిపించగా, కాంగ్రెస్‌ మూడు మండలాల్లో సత్తా చాటింది.

2001లో టీఆర్‌ఎస్‌ హవా..

 2001లో నిర్వహించిన ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పుడే ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ తన సత్తా చాటింది. నియోజకవర్గంలో పట్టు ఉన్న కాంగ్రెస్, టీడీపీలను మట్టి కరిపించిన టీఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక సంస్థలలో పాగా వేశారు. ఒక్క కమ్మర్‌పల్లిలో మాత్రం జెడ్పీటీసీ స్థానం కాంగ్రెస్‌కు లభించింది. ఈ ఎన్నికల్లో మోర్తాడ్‌ ఎంపీపీగా కనకం గంగనర్సు, జెడ్పీటీసీగా నూగూరు ప్రకాశ్, బాల్కొండ ఎంపీపీగా బద్దం నర్సవ్వ, జెడ్పీటీసీ సభ్యునిగా ఈఎన్‌ రావు, ఆర్మూర్‌ ఎంపీపీగా ఉషారాణి, జెడ్పీటీసీ సభ్యుడిగా రణధీర్‌ ఎంపికయ్యారు. నందిపేట్‌ ఎంపీపీగా సమంత సాయిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడిగా నారాగౌడ్, కమ్మర్‌పల్లి ఎంపీపీగా గుడిసె అంజమ్మ టీఆర్‌ఎస్‌ తరపున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో కమ్మర్‌పల్లి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ తరపున చింత ధర్మపురి ఎంపికయ్యారు.

2006లో తారుమారు.. 

2006 ఎన్నికల నాటికి ఫలితాలు తారుమారయ్యాయి. టీఆర్‌ఎస్‌ హవా పూర్తిగా తగ్గిపోయి కాంగ్రెస్, టీడీపీ పుంజుకున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగు మండలాల్లో కాంగ్రెస్, ఒక మండలంలో టీడీపీ విజయం సాధించాయి. మోర్తాడ్‌ ఎంపీపీగా గుర్రం నర్సయ్య, జెడ్పీటీసీ సభ్యురాలిగా శారద తెలుగుదేశం పార్టీ గెలుపొందారు. బాల్కొండ ఎంపీపీగా జక్క రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యునిగా గంగాధర్, ఆర్మూర్‌ ఎంపీపీగా సుంకర శెట్టి, జడ్పీటీసీ సభ్యునిగా దేవమల్లయ్య కాంగ్రెస్‌ నుంచి ఎన్నికయ్యారు. నందిపేట్‌ ఎంపీపీగా కోల రాములు, జెడ్పీటీసీ సభ్యుడిగా నాయుడు ప్రకాశ్, కమ్మర్‌పల్లి ఎంపీపీగా గోపు దేవిదాస్, జెడ్పీటీసీ సభ్యురాలిగా లక్ష్మి గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో బాల్కొండ నియోజకవర్గం స్వరూపం మారిపోయింది. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాలు యథావిధిగా నియోజకవర్గంలో ఉండగా, వేల్పూర్, భీమ్‌గల్‌ మండలాలు కొత్తగా చేరాయి. అనంతరం 2014లో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అన్ని మండలాల్లో గులాబీ పార్టీ ఆధిక్యతను చాటుకుంది. టీఆర్‌ఎస్‌ తరపున ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు గెలిచి ఆ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకవచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top