ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి | Autonomy to M NJ hospital | Sakshi
Sakshi News home page

ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి

Oct 22 2016 1:02 AM | Updated on Sep 4 2017 5:54 PM

ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి

ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి

రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న కేన్సర్ నియంత్రణకుగాను వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై

నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయ
మాసబ్‌ట్యాంక్ సమీపంలో ఐదెకరాల్లో విస్తరణకు పచ్చజెండా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న కేన్సర్ నియంత్రణకుగాను వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక మెహిదీ నవాజ్ జంగ్(ఎంఎన్‌జే) కేన్సర్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలని, దానికి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. నిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్ల అది కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్‌లాగే ఎంఎన్‌జేను కూడా తీర్చిదిద్దాలని యోచిస్తోంది.

స్వయంప్రతిపత్తి వల్ల ఆసుపత్రి డెరైక్టర్ అధికారాల మేరకు అవసరమైనప్పుడు పోస్టులను భర్తీ చేసుకోవచ్చు. వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పెత్తనం పోతుంది. యూనివర్సిటీలాగా దీన్ని తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది. ఆంకాలజీలో ఎండీ, ఎంఎస్ కోర్సులను ప్రత్యేకంగా నెలకొల్పుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి సొంత కోర్సులకూ రూపకల్పన చేసుకోవచ్చు. కేన్సర్‌పై ప్రత్యేక పరిశోధనాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఐదెకరాల్లో విస్తరణ..
ఎంఎన్‌జే ఆసుపత్రి విస్తరణ కోసం మాసబ్‌ట్యాంక్ పరిధిలోని ఐటీఐ, నర్సింగ్ కాలేజీల కు చెందిన ఐదెకరాల స్థలాన్ని దానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో ప్రత్యేకంగా పది బ్లాక్‌లను నిర్మిస్తారు. అం దులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయిస్తారు. కేన్సర్ వైద్య విద్య కోసం మరో బ్లాక్ ఉంటుంది. అత్యాధునిక వైద్య విద్య తరగతి గదులనూ నిర్మిస్తారు. ఎంఎన్‌జేకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.28 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. స్వయంప్రతిపత్తి వస్తే రూ.50 కోట్ల బడ్జెట్ పెరిగే అవకాశముంది. కేంద్రం నుంచి ప్రతీ ఏడాది రూ.70 కోట్ల మేరకు గ్రాంట్లు విడుదలవుతాయి.

పడకల సంఖ్య 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మం జూరు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ కేన్సర్ కేంద్రంగా, రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్షమంది రోగులు ఫాలోఅప్ వైద్యానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వయంప్రతిపత్తి, విస్తరణ వల్ల ఎంఎన్‌జే స్వరూపమే మారిపోతుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ జయలత ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement