చిరుద్యోగులపై చిన్నచూపు!

ANM Nursing Problems Regular Nizamabad - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: వైద్యారోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో అన్ని విధులు నిర్వహించే రెండో ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా క్రమబద్ధీకరణకు నోచుకోక, సకాలంలో వేతనాలు అందక అష్ట కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో అన్ని వైద్య సేవలు అందించే కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను పాలకులు, ఉన్నతాధికారులు చిన్న చూపు చూస్తున్నారు. పైగా కాంట్రాక్ట్‌ విధానంలో కొనసాగిన వీరు.. అధికారుల తప్పిదం వల్ల ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా మారిపోయారు.! దీంతో తాము రెగ్యులర్‌ అయ్యే అవకాశం కోల్పోతామని రెండో ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. 

కాంట్రాక్ట్‌ నుంచి ఔట్‌సోర్సింగ్‌కు..! 
ఉమ్మడి జిల్లాలో 17 క్లస్టర్ల పరిధిలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 377 ఉప కేంద్రాలు కొనసాగుతున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు, పీహెచ్‌సీలకు ఇద్దరు, ఉప కేంద్రానికి ఒక్కరు చొప్పున 376 మంది కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. 2001 నుంచి 2007 వరకు ఇంటర్వ్యూలు, రోస్టర్‌ రిజర్వేషన్‌ ప్రకారం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వీరంతా ఎంపికయ్యారు. వీరిలో కొంత మందిని యూరోపియన్‌ స్కీం కింద, మరికొంత మందిని జాతీయ గ్రామీణ ఆరోగ్య ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద, మరి కొందరిని ఆర్‌సీహెచ్‌–2 స్కీం కింద నియమితులయ్యారు.

2007 తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి కొందరిని ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఐదేళ్లు కాంట్రాక్ట్‌ పద్ధతిలో కొనసాగిన వారిని రెగ్యులర్‌ చేస్తామని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన జిల్లాలో 186 మంది కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు రెగ్యూలర్‌ అయ్యే అవకాశముంది. అయితే, ఉన్నతాధికారులు తరచూ నిబంధనలు మారుస్తుండడంతో ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో పని చేసే వారు సంవత్సరానికి ఒకసారి బాండ్‌ పేపర్‌ ద్వారా కాంట్రాక్ట్‌ను రెన్యూవల్‌ చేసుకోవాల్సి. అయితే, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను ఔట్‌సోర్సింగ్‌ కింద పరిగణిస్తూ అధికారులు గతంలో బాండ్‌ రాయించుకున్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ప్రస్తుతం వారు ఆందోళనకు గురవుతున్నారు.

చాలీచాలని వేతనాలు.. 
కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారి స్థాయిలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రతి పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్లలో రెగ్యులర్‌ ఏఎన్‌ఎంతో పాటు కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు సమానంగా గ్రామాలను కేటాయించారు. రెగ్యులర్‌ ఏఎన్‌ఎంతో పాటు టార్గెట్‌ను నిర్ణయించారు. బాధ్యతలు సమానంగా అప్పగించారు. అయితే, వేతనంలో మాత్రం భారీ తేడా ఉంది. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు మూడు, నాలుగు నెలలకు ఒకసారి వతనాలు చెల్లిస్తున్నారు. సకాలంలో డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు పీఎఫ్‌ పేరిట రూ.2 వేల కోత విధిస్తున్నా, ఇంత వరకు వారికి పీఎఫ్‌ నెంబర్‌ ఇవ్వలేదు. వ్యాక్సిన్‌ డ్యూటీకి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ఖర్చును సైతం ఏఎన్‌ఎంలే భరిస్తున్నారు. మార్పులో భాగంగా ప్రతి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని కోసం వారు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు.

డిమాండ్లు ఇవే.. 
రోస్టర్, రిజర్వేషన్‌ ప్రకారం కాంట్రాక్టు విధానంలో ఏఎన్‌ఎంలను ఎంపిక చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. కనీస వేతనం రూ.32 వేలతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వ్యాక్సిన్‌ అలవెన్సు రూ.500, యూనిఫాం అలవెన్సు రూ.1500, ఎఫ్‌టీఏ రూ.550 ఇవ్వడంతో పాటు 35 క్యాజువల్‌ లీవ్స్, 180 రోజులు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నైట్‌ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దుతో పాటు ఇతర డిమాండ్లు సర్కారు ముందు ఉంచుతున్నారు.

ఏడాదైనా వెలువడని లేని ఫలితాలు.
గత ఎడాది టిఎస్‌పిఎస్‌సి ద్వార ఏఎన్‌ఎంలకు సంబందించి రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్‌ విభాగంలో పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ జరిగింది. గతేడాది మే నెలలో పరీక్ష నిర్వహించగా, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదు. కొన్ని రోజుల క్రితం ఏఎన్‌ఎంల నుంచి సర్వీస్‌ వివరాలను సేకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్‌ఎంలకు సర్వీస్‌ మార్కులు కలిపి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎంత మంది ఉద్యోగం పొందుతారో తెలిసి పోతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు.

రెగ్యులర్‌ చేయండి.. 
రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. మమ్మల్ని కూడా రెగ్యులర్‌ చేయాలి. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా మాకు ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇకనైన మమ్మల్ని రెగ్యులర్‌ చేయాలి. మా సమస్యలను పరిష్కరించాలి. – పద్మ, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం  

పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.. 
వైద్యారోగ్యశాఖలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు రెండో ఏఎన్‌ఎంలు. 15 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదు. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించడంలో ఏఎన్‌ఎంల పాత్ర ఎంతో ముఖ్యం. రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం. – నటరాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top