చలికాలంలో సీఓపీడీని అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది | - | Sakshi
Sakshi News home page

చలికాలంలో సీఓపీడీని అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది

Published Tue, Dec 5 2023 5:20 AM | Last Updated on Tue, Dec 5 2023 10:48 AM

- - Sakshi

గుంటూరు మెడికల్‌: మోహన్‌ ప్రతిరోజూ సిగిరెట్లు కాలుస్తాడు. మూడు నెలలుగా దగ్గు వస్తున్నా పట్టించుకోకుండా వదిలివేశాడు. స్మోకింగ్‌ మానేయాలని వైద్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. చలికాలం ప్రారంభం కావడంతో ఇటీవల ఓ రాత్రివేళలో శ్వాసతీసుకోవటం ఇబ్బందిగా ఉండి నిద్రకూడ పట్టకపోవటంతో అర్థరాత్రి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు శ్వాసకోస నాళాలకు సోకే సీఓపీడీ వ్యాధి సోకినట్లు చెప్పి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఎందరో ఈ వ్యాధి సోకినా తెలియక ప్రాణాపాయ స్థితివరకు ఇళ్ల వద్ద ఉంటూ చివరి సమయంలో పరుగులు తీస్తున్నారు. 2019లో 3.23 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా సీఓపీడీతో మృతిచెందారు. మనదేశంలో ప్రతిఏడాది 2,300 మంది చనిపోతున్నారు.

సీఓపీడీ అంటే...
క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌( సీఓపీడీ). ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి ఇది. వ్యాధి సోకినవారికి గాలి గొట్టాలు ఇన్‌ఫెక్షన్‌కు గురై కొన్ని సార్లు మూసుకుపోయి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఆయాసం, దగ్గు, కళ్లెపడటం, ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, గుండెదడ, కాళ్లు వాయటం, పిల్లికూతలు, బరువు తగ్గటం, కొద్దిగా జలుబు చేయగానే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎక్సరే, స్పైరో మెట్రో లేదా పల్మనరీ ఫంక్షన్‌ టెస్ట్‌ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు.

ఈ వ్యాధి ఎవరికి వస్తుంది...
ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ వస్తుంది. పొగతాగేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగకపోయినా పొగతాగేవారి పక్కన ఉండి పొగ పీల్చటం వల్ల కూడా వ్యాధి వస్తుంది. గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, కట్టెల పొయ్యి, పిడకల పొయ్యి వినియోగించేవారికి, బొగ్గు గనుల్లో, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారికి, ధుమ్ము, ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో, పరిశ్రమల్లో పనిచేసేవారికి వ్యాధి సోకుతుంది. ఉబ్బసం( ఆస్తమా), అలర్జీ ఉన్నవారు జబ్బు నయం అయ్యేందుకు వైద్యం చేయించుకోకపోతే సీఓపీడీ రావచ్చు.

జిల్లాలో వ్యాధి బాధితులు...
జిల్లాలో 50 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) ఉన్నారు. ప్రతిరోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఇరువురు లేదా, ముగ్గురు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల హాస్పటల్‌లో ప్రతిరోజూ పది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement