జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
బాపట్ల: సమాజంలోని మహిళలు అందరూ సంతోషంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పేదరిక నిర్మూలన సంస్థ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌లతో కలసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో విజయాలు సాధించాలన్నారు. గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా బలపడుతున్నారని, ఈ సంఘాల ద్వారా చిన్న వ్యాపారాలు ప్రారంభించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటున్నారని తెలిపారు. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి బాలికకు నాణ్యమైన విద్య అందేలా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. మహిళలపై హింసను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అవసరమైన సమయంలో మహిళలు సహాయం కోసం ముందుకు రావాలని సూచించారు. అంతకు ముందు డీఆర్డీఏ, మెప్మా, ఉద్యాన, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పి.గ్లోరియా, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా, మహిళా, శిశు సంక్షేమ శాఖల పీడీలు బి.సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద పాల్, రాధామాధవి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, జీఎండీఐ సి.రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజర్ మాధవి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మావతి, పౌర సరఫరాల శాఖ డీఎం శ్రీలక్ష్మి, తహసీల్దార్ షేక్ సలీమా, మహిళ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


