కొల్లూరు : భక్తుల కోలాహలం నడుమ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరిగింది. మండలంలోని దోనేపూడి గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్లలో పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించారు. అధిక సంఖ్యలో వాహనాలు, పశువులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ప్రత్యేక అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన దుకాణాలు, క్రీడా వినోద పరికరాల ప్రాంతంలో సందడి నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అవాంతరం లేకుండా అదనపు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు కొల్లూరు ఎస్‌ఐ పి. కోటేశ్వరరావు తెలిపారు.


