రాష్ట్రానికి వచ్చేవన్నీ..రాజధాని రైళ్లే!

After Lockdown Announced Regular Train Services Start From 12th May - Sakshi

లాక్‌డౌన్‌ ప్రకటించాక తొలిసారిగా సాధారణ రైళ్ల రాకపోకలు

రాష్ట్రం మీదుగా మూడు రైళ్లు

రిజర్వేషన్‌కు ఎగబడ్డ జనం.. మొరాయించిన సర్వర్‌

చాలాసేపటి వరకు తెరుచుకోని బుకింగ్స్‌

సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లపై నిర్ణయం తీసుకోని కేంద్రం 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ప్రకటించాక తొలిసారిగా సాధారణ ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడిచాయి. ఇటీవల వలస కూలీలను తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లను ప్రారంభించారు. సాధారణ ప్రయాణికుల రైళ్లు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో మన రాష్ట్రం మీదుగా మూడు రైళ్లు తిరగనున్నాయి. ఢిల్లీ–సికింద్రాబాద్, సికింద్రాబాద్‌–ఢిల్లీ, ఢిల్లీ–బెంగళూరు, బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చెన్నై, చెన్నై–ఢిల్లీ రైళ్లు ఇందులో ఉన్నాయి. బెంగళూరు రైలు సికింద్రాబాద్‌ మీదుగా, చెన్నై రైలు వరంగల్‌ మీదుగా నడుస్తాయి. ఇవన్నీ రాజ ధాని రైళ్లే కావటం విశేషం. ఇవి కాకుండా సాధారణ సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు ఎప్పు డు ప్రారంభించాలనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. 
(చదవండి: హైదరాబాద్కు చేరుకున్నవందేభారత్ఫ్లైట్)

ప్రత్యేక రైళ్లు ఇవే...

  • న్యూఢిల్లీ–సికింద్రాబాద్‌ ఏసీ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ రైలు (02438) ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 
  • సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ రైలు (02437) ఈ నెల 20న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇది నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతుంది. 
  • బెంగళూరు–న్యూఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (02691) ఈ నెల 12న రాత్రి 8.30కి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరిగి 8.05కు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.55కు ఢిల్లీ చేరుకుంటుంది. 
  • ఢిల్లీ–బెంగళూరు (02692) స్పెషల్‌ రైలు 12న రాత్రి 9.15కు ఢిల్లీలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.20కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరిగి 6.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి బెంగళూరు చేరుకుంటుంది. ఇది అనంతపూర్, గుంతకల్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీలలో ఆగుతుంది. 
  • న్యూఢిల్లీ–చెన్నై (02434) రైలు 13న (ఇది ప్రతి బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది) సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో బయలుదేరి రెండో రోజు రాత్రి 8.40కి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. 
  • చెన్నై సెంట్రల్‌–న్యూఢిల్లీ (02433) స్పెషల్‌ రైలు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌లో 15న (ఇది ప్రతి శుక్ర, ఆదివారాలు నడుస్తుంది) ఉదయం 6.35కు బయలుదేరి రెండో రోజు ఉదయం 10.30కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇది విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రాలలో ఆగుతుంది. 
  • 15 నిమిషాల్లో టికెట్లు క్లోజ్‌..
  • చాలా రోజుల తర్వాత ప్రయాణ అవకాశం రావటంతో బుకింగ్‌ కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ కూడా చాలాసేపు తెరుచుకోలేదు. ప్రత్యేక రైళ్లకు సోమవారం సాయంత్రం 4 గంటలకు రిజర్వేషన్‌ బుకింగ్స్‌ ప్రారంభించనున్నట్టు రైల్వే ప్రకటించింది. కానీ సాయంత్రం 7.30 గంటల వరకు కూడా బుకింగ్‌ ఆప్షన్‌ ఆన్‌ కాలేదు. ఏడున్నర సమయంలో ఢిల్లీ–బెంగళూరు రైలు బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఆ రైలులో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వరకు ఉన్న టికెట్లన్నీ కేవలం 15 నిమిషాల్లో అయిపోయాయి. అదే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో.. బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు గంట సేపట్లో అమ్ముడయ్యాయి. రాత్రి తొమ్మిది దాటే వరకు మిగతా రైళ్ల బుకింగ్స్‌ ఆప్షన్‌ తెరుచుకోలేదు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top