జిల్లాలో పాల సేకరణను భారీగా పెంచేందుకు అన్ని చర్యలు...
సంగారెడ్డి అర్బన్:జిల్లాలో పాల సేకరణను భారీగా పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం నూతనంగా ఏర్పాటైన జిల్లా పాడి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు, పాల సేకరణకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ డెయిరీలకు దీటుగా ప్రభుత్వం విజయ డెయిరీ పాడి రైతులకు పాల సేకరణ ధను లీటరుకు రూ.4లు పెంచిందని, పాడి రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా విజయ ఉత్పత్తి సంఘాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న పాడి పశువుల ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని ఎదగాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం జిల్లాలో 40వేల లీటర్ల పాలను ప్రతిరోజు సేకరిస్తున్నామన్నారు. దీనిని జనవరి నాటికి 80 వేల లీటర్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంఘాలు చురుకుగా పనిచే సి పాల సేకరణ పెంపునకు కృషి చేయాలని, నిరుద్యోగ యువతకు మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలను కల్పిస్తామన్నారు. సమావేశంలో పశు సంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, డెయిరీ డీడీ రమేష్, వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, డ్వామా పీడీ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.