ఆసరాకు.. అడ్డంకులు!

Aasara Pension Scheme Not Implementation In Telangana - Sakshi

అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసరా పింఛన్‌ పెంచడంతోపాటు లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో ఓటరుజాబితాలో వయస్సును బట్టి అధికారులు పలువురిని లబ్ధిదారులుగా గుర్తించినా వారిలో ఒకే ఇంట్లో రెండు పింఛన్లు, వారి పిల్లల ఉద్యోగస్తులుగా ఉండడం తదితర కారణాల రీత్యా ఆ జాబితాను వడబోశారు. కానీ వరుస ఎన్నికలు రావడం..కోడ్‌ అమలులో ఉండడం వంటి ఆటంకాలతో అర్హులు పింఛన్‌ డబ్బుల కోసం ఎదురుచూడక తప్పడం లేదు. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొత్తగా ఆసరా పెన్షన్లు పొందేందుకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పెన్షన్‌  వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. అనుకున్నట్లుగానే తిరిగి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆసరా పెన్షన్ల కోసం బడ్జెట్‌లో నిధులను కూడా కేటాయించింది.

కానీ కొత్తగా అర్హులైన పెన్షన్‌ దారులు ఆసరా పెన్షన్లు పొందేందుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే లోక్‌ సభ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినా దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్‌ మే 23 వరకు అమలులోనే ఉంటుంది. దీనికి తోడు జిల్లా పరిషత్‌ ఎన్నికల కోడ్‌ కూడా అమలులోకి రావడంతో ఈనెలలో కొత్త పెన్షన్‌దారులకు ఆసరా అందడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,89,589 మంది వివిధ రకాల ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో వృద్ధాప్య పెన్షన్లు 65,472 మంది పొందుతుండగా, దివ్యాంగులు 30,315 మంది, వింతంతు పెన్షన్లు 76,029 మంది, చేనేత కార్మికులు 2,928 మంది, గీత కార్మికులు 7,597 మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వంటరి మహిళలకు కూడా పెన్షన్‌ కల్పించడంతో జిల్లాలో 7248 మంది పెన్షన్‌ పొందుతున్నారు.
 
ప్రతినెలా రూ.20.47 కోట్లు ఖర్చు
ప్రతినెలా ప్రభుత్వం జిల్లాలోని వివిధ రకాల పెన్షన్‌ దారులకు  రూ.20,47,46,500 జిల్లాలో ఖర్చు చేస్తుంది. ఇందులో వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.వెయ్యి పెన్షన్‌ అందిస్తుండగా, వికలాంగులకు మాత్రం రూ.1500 అందజేస్తుంది.
 
కొత్త లబ్ధిదారుల ఎంపిక 
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండోసారి అధికారం చేపట్టగానే ఆసరా పెన్షన్ల కోసం 65 నుంచి 57 సంవత్సరాల వయస్సు ఉన్న అర్హులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను అనుసరించి డీఆర్‌డీఏ అధికారులు 57 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారందరినీ గుర్తించారు. అందులో 84,515 మంది 57 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారిగా గుర్తించారు.

గుర్తించిన వారిలో అర్హులను తేల్చిన ఎంపీడీఓలు
ఓటర్ల జాబితా ఆధారంగా 84,515 మందిని గుర్తించగా, ఆయా మండలాల ఎంపీడీఓలు వాటన్నింటినీ పరిశీలించారు. అందులో ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరు పెన్షన్‌ పొందుతుండడం వల్ల కొందరిని తొలగించగా, మరికొందరిని ఇతర కారణాలతో అనర్హులుగా తేల్చారు. చివరికి 35863 మందిని  అర్హులుగా గుర్తించారు.

క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తే పెరగొచ్చు...
ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉన్న అధికా రులు 57 సంవత్సరాల వరకు ఉన్నవారి ని గుర్తించగా ఎంపీడీఓలు వారి జాబితా లను పరిశీలించి అర్హులుగా గుర్తించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అసవరం ఉంది. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో అధికారులంతా బిజీగా ఉండడం, దానికితోడు కోడ్‌ కూడా ఉండడంతో ఇటు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించకపోవడం, అటు ప్రభుత్వం కూడా కోడ్‌ కారణంగా కొత్త పెన్షన్‌ను అమలు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

జూన్‌ వరకు కొత్త పెన్షన్‌దారులకు ఎదురుచూపులు తప్పవు
ఇటు ఎన్నికల కోడ్, మరోపక్క అధికా రుల ఎన్నికల విధులతో బిజీగా ఉండడం వల్ల కొత్త పెన్షన్‌ దారులు అర్హత సాధించినా ప్రభుత్వం ఇస్తానన్న సమయం నుంచి పెన్షన్లు పొందలేని పరిస్థితి. మే మాసంలో కూడా అందే అవకాశాలు కన్పించడం లేదు. ఎన్నికలు పూర్తయితేనే అటు ఎన్నికల కోడ్‌తోపాటు అధికారులు కూడా ఫ్రీ అవుతారు. జూన్‌మాసంలో కొత్తవారికి పెన్ష న్‌ అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు కొత్త పెన్షన్‌దారులు ఎదురుచూడక తప్పని పరిస్థితి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top